Lalit modi : IPLల్లో చేతబడి వ్యవహారం.. ‘2011 సీజన్ లో ఓ టీం ఓనర్ కూడా ఇలాంటివి చేశాడు’ : లలిత్ మోదీ
Lalit Modi : ఐపీఎల్ మ్యాచ్ లో చేతబడి వ్యవహారంపై లలిత్ మోదీ స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు.
- Dharani Pilli
- Updated on- April 20, 2026 / 05:48 PM IST
Lalit Modi Makes Shocking comments Black Magic In IPL Claim Said A Team Owner Did So In 2011
- ఐపీఎల్లో చేతబడి వ్యవహారం
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లలిత్ మోదీ
- ఆ టీమ్ ఓనర్ కూడా క్షుద్ర పూజలు చేయించాడు
Lalit modi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సాధించిన విజయం ఆ జట్టులో నూతనోత్తేజాన్ని నింపింది. అయితే మ్యాచ్ తర్వాత గెలుపోటముల గురించి కాకుండా.. చేతబడి (బ్లాక్ మ్యాజిక్) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎస్‌కే ప్లేయర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని నిమ్మకాయను చేతిలో పట్టుకుని.. కళ్లు మూసుకుని.. ఏవో మంత్రాలు చదివాడు. ఆ వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
SRH అభిమాని చేసిన చేతబడి వల్లే శివమ్ దూబే అవుట్ అయ్యాడని కొందరు వాదించారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వచ్చాయి.. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా.. చేతబడి చేస్తే వికెట్లు పడతాయా.. ఇదంతా సరదాగా చేశారని కొందరు కామెంట్స్ చేశారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి.. ఈ చేతబడి వ్యవహారం మీద సీఎస్‌కే.. బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లుగా ఒక నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ క్రమంలో ఈ చేతబడి వ్యవహారంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌కే మీద జరుగుతున్న చేతబడి ప్రచారాన్ని ఖండించారు. అయితే ఐపీఎల్ సీజన్ ఆరంభంలో.. ఓ టీమ్ ఓనర్ ఇలాంటి మూఢనమ్మకాలను బాగా నమ్మేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు యజమాని ప్రత్యర్థి జట్టు ఓడిపోవాలని వారి డ్రెస్సింగ్ రూమ్‌లో క్షుద్ర పూజలు చేశాడని లలిత్ మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
‘చేతబడి వ్యవహారంపై సీఎస్‌కే.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ నకిలీది. కాకపోతే ఐపీఎల్ ప్రారంభంలో మాత్రం ఓ టీమ్ ఓనర్ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే క్షుద్ర పూజలు చేశారు. ఐపీఎల్ 2011 సీజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు నా వద్ద ఉన్నాయని, అప్పుడే సదరు యజమానిని హెచ్చరించానని’ వెల్లడించారు.
ఈ షాకింగ్ చర్యలకు బాధ్యులైన వారి వివరాలను తన జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమా లేదా టీవీ సిరీస్ ద్వారా వెల్లడిస్తానని లలిత్ మోదీ తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షుద్ర పూజలు చేసిన టీమ్ ఓనర్ ఎవరా అంటూ నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. పలు జట్ల పేర్లు ప్రస్తావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఐపీఎల్ 2026 పట్టిక విషయానికి వస్తే.. ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. అయితే టాప్-4 కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ కూడా ఆరు పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు, నాలుగు మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలిచిన సూపర్ కింగ్స్ ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది.
