Vaibhav Sooryavanshi : సెంచరీ బాదిన వేళ సంచలన ఆరోపణలు.. ‘సూర్యవంశీ బుర్రలో AI చిప్.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే.. బ్యాటులో కూడా’
AI Chip in Vaibhav Sooryavanshi Bat: సన్ రైజర్స్ హైదరాబాద్ మీద సెంచరీ బాదిన వేళ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్ ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
- Dharani Pilli
- Updated on- April 27, 2026 / 04:32 PM IST
Pakistan nauman niaz on vaibhav sooryavanshi using ai chip in bat sent to him lab for testing
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ లో పెను సంచలనంగా నిలిచాడు. ఈ సీజన్ ఐపీఎల్ 2026 రాజస్తాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలో దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతూ.. వారిని ముప్ప తిప్పలు పెడుతున్నారు. తనదైన స్టైల్లో అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బ్యాట్ తో రెచ్చిపోయిన సూర్యవంశీ.. శతక్కొట్టాడు. కానీ ఇప్పుడిదే సెంచరీ మీద కొందరు ఆసక్తికర ఆరోపణలు చేస్తున్నారు.
సూర్యవంశీ చేసిన సెంచరీపై పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైభవ్ సూర్యవంశీని ఒకసారి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) పరీక్షిస్తే బాగుంటుంది.. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేశారా అనే దాని గురించి తెలుసుకోవడానికి అతడిని ల్యాబ్ కి పంపాలి. వైభవ్ నాకు మామూలు మనిషిలా అనిపించడం లేదు.. కాకపోతే అతడి మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.
నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏళ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా.. టీనేజ్ వయసులోనే ఇన్ని భారీ సిక్సర్లు ఎలా బాదుతున్నాడో నాకు అర్థం కావడం లేదన్నాడు.
ఇప్పటికే సూర్యవంశీ 8 మ్యాచులు ఆడగా.. 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో ఉన్నాడు. అతడు ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. ఈసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడగా.. 5 మ్యాచులలో విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
