Sunil Gavaskar : దక్షిణాఫ్రికాపై ఓటమి.. భారత బ్యాటర్ల పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. అభిషేక్ శర్మ నువ్వు అసలు..
టీమ్ఇండియా బ్యాటర్లపై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
T20 World Cup 2026 IND vs SA Sunil Gavaskar fire on Indian batters
Sunil Gavaskar : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టులో శివమ్ దూబె మాత్రమే ఓ మోస్తరుగా రాణించాడు. 37 బంతుల్లో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి.
Team India : ఒకే ఒక ఓటమి.. టీమ్ఇండియా సెమీస్ ఆశలు గల్లంతు..! మహాద్భుతం జరగాల్సిందేనా?
కాగా.. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల తీరును మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్రంగా విమర్శించాడు. టీమ్ఇండియా బ్యాటర్ల షాట్ల ఎంపిక చాలా పేలవంగా ఉందని మండిపడ్డాడు. ఓపిక, క్రమశిక్షణతో ఆడాల్సిన పిచ్‌పై షాట్ల ఎంపికలో లోపాలతో వరుసగా పెవిలియన్‌కు చేరుకున్నారని ఆగ్రహించాడు. సఫారీ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్‌లు చాలా చక్కగా ఆడారని కొనియాడాడు. బంతి బ్యాట్‌పైకి రాకున్నప్పటికి కూడా పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకు భారీ స్కోరుకు సాయపడ్డారని అన్నారు. అయితే.. భారత బ్యాటర్లు అలా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించాడు.
అభిషేక్ శర్మ గురించి ఏమన్నాడంటే..?
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్లు అయిన అభిషేక్ శర్మ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. అయినప్పటికి 12 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ.. అతడిలో రిథమ్‌లో లేనట్లుగా అనిపిస్తోంది. నెట్స్‌లో మీరు తొలి బంతికే ఔట్ అయినప్పటికి కూడా మరో బంతిని ఆడేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. మ్యాచ్‌లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పెద్ద షాట్లను ఆడేటప్పుడు చేతులు చాలా ఫ్రీగా మూవ్ కావాలి.
కానీ.. ఇక్కడ దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. అభిషేక్ శర్మ బాడీని టార్గెట్ చేస్తూ బంతులు విసిరారు. అభిషేక్ ఆఫ్ సైడ్‌లో బాగా ఆడతాడని తెలుసు. అందుకనే ఆ ఏరియాలో బౌలింగ్ చేయకుండా అతడు జరిగి ఆడకుండా ఉండేలా ప్లాన్ చేసింది. రబాడను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అతడు ఒక సిక్స్ ఇచ్చినప్పటికి కూడా అతడు ప్లాన్‌ను చేంజ్ చేయలేదు. అభిషేక్ ప్యాడ్లను లక్ష్యంగానే బౌలింగ్ చేశాడు అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
