Vaibhav Sooryavanshi : ఘోరంగా విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. 12 బంతులు ఆడి..
శ్రీలంక వేదికగా ప్రారంభమైన ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఘోరంగా విఫలం అయ్యాడు.
Tri Nation A Series Vaibhav Sooryavanshi fail against Sri Lanka A
Vaibhav Sooryavanshi : ఐపీఎల్లో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ శ్రీలంక వేదికగా ప్రారంభమైన ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు.
మంగళవారం దుంబుల్లా వేదికగా శ్రీలంక-ఏ జట్టుతో భారత్-ఏ తలపడుతోంది. తిలక్ వర్మ సారథ్యంలో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
12 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నాలుగో బంతికి మొహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో సహన్ అరాచ్చిగే క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 11 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ సైతం ఔట్ అయ్యాడు. కరుణరత్నె బౌలింగ్‌లో సమరవిక్రమ క్యాచ్ అందుకోవడంతో ప్రభ్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 16 పరుగుల వద్దే ఓపెనర్లు ఇద్దరికి కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది.
ఐపీఎల్ 2026 సీజన్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడు వైభవ్ సూర్యవంశీ. 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటు 237.31 స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అతడు తొలిసారి భారత జట్టుకు ఎంపిక అయ్యాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు ఆసియా గేమ్స్‌లలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కింది. అంతకంటే ముందు శ్రీలంక వేదికగా జరుగుతున్న భారత-ఏ జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే.. టీ20 ఫార్మాట్లో దుమ్ములేపిన వైభవ్, వన్డే ఫార్మాట్లో విఫలం అయ్యాడు. అఫ్గానిస్థాన్-ఏతో జూన్-11 జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
