Microsoft Services Down: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో భారీ సాంకేతిక లోపం.. లక్షలాది మంది ఉద్యోగులకు ఇబ్బందులు.. 1.38 లక్షలకు పైగా ఫిర్యాదులు!
ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటలకు పైగా మైక్రోసాఫ్ట్ (Microsoft Services Down)సేవలు స్తంభించిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సేవలపై తీవ్ర ప్రభావం పడింది.
Microsoft 365 services down globally for over 7 hours openai anthropic affected
Microsoft Services Down: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో తలెత్తిన భారీ సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారులు, కార్పొరేట్ ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేసింది. శుక్రవారం (నవంబర్ 13) ఏడు గంటలకు పైగా మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ సహా పలు కీలక సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా డౌన్‌డిటెక్టర్‌లో ఒక్క అవుట్‌లుక్ పైనే 1.38 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇమెయిల్స్ పంపడం, కీలక ఫైళ్లు తెరవడం, మీటింగ్స్ షెడ్యూల్ చేయడం ఆగిపోవడంతో ఆఫీసు పనులకు తీవ్ర ఆటంకం కలిగింది.
ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సేవలపైనా ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే:
మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై (Microsoft Services Down)ఆధారపడి పనిచేసే ఏఐ దిగ్గజాలు OpenAI, Anthropic సేవల్లోనూ అంతరాయం ఏర్పడింది. సర్వర్ల సంఖ్య తగ్గడం వల్ల సురక్షిత కనెక్షన్ల ఏర్పాటుపై అధిక భారం పడి ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ టెక్నికల్ గ్లిచ్ కారణంగా అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ ట్రక్కుల సంస్థ ‘వర్క్‌హార్స్ గ్రూప్’ తన ఆర్థిక ఫలితాల ప్రకటనను నవంబర్ 16కు వాయిదా వేసుకుంది.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు.. విశ్వసనీయతపై చర్చ:
ప్రభావిత సర్వర్లను రీస్టార్ట్ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు విధించి మైక్రోసాఫ్ట్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. అయితే ఇటీవల అజూర్ క్లౌడ్‌లోనూ ఇలాంటి అంతరాయమే కలగడంతో, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల విశ్వసనీయతపై టెక్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
