OnePlus Shut Down : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇక మార్కెట్లో OnePlus ఫోన్లు కనిపించవా..?
OnePlus Shut Down : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు భారీ బిగ్ షాక్.. ప్రపంచ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లు మాయం కానున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి ఈ బ్రాండ్ ఎగ్జిట్ కానుందా? అసలు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం..
OnePlus Shut Down
- వన్‌ప్లస్‌కు ఎండ్ కార్డ్ పడిందా..? కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏంటి?
- అసలు కంపెనీకి ఏమైంది..? ప్రపంచ మార్కెట్ నుంచి మెల్లగా మాయమవుతోందా?
- వన్ ప్లస్ ఫోన్లకు గుడ్‌బై చెప్పాల్సిందేనా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది?
- గ్లోబల్ మార్కెట్ నుంచి ఔట్..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?
OnePlus Shut Down : వన్‌ప్లస్ లవర్స్‌కు బిగ్ షాక్.. ఇకపై వన్‌ప్లస్ మార్కెట్లోకి కనిపించవు. చైనా తప్ప ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో వన్‌ప్లస్ ఫోన్లు ఇక దొరకవు.. ఒకప్పుడు ‘ఫ్లాగ్షిప్ కిల్లర్’గా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసిన వన్‌ప్లస్ బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను షట్ డౌన్ చేస్తుందనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చైనా మినహా ఇతర దేశాల్లో వన్‌ప్లస్ కార్యకలాపాలను దశలవారీగా (OnePlus Shut Down) నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వారం నుంచే యూఎస్, యూరోపియన్ రెండు స్మార్ట్ ఫోన్ మార్కెట్లలోనూ వన్‌ప్లస్ తన కార్యకలాపాలను నిలిపివేయనుందని నివేదిక పేర్కొంది. తగ్గుతున్న వినియోగదారుల డిమాండ్, పెరుగుతున్న విడిభాగాల ధరల కారణంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
2013లో పీట్ లా, కార్ల్ పీ స్థాపించిన వన్‌ప్లస్ కంపెనీ ప్రారంభంలో టెక్నాలజీ ప్రియుల కోసం పోటీ ధరలలో ఫ్లాగ్షిప్-లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందించి బాగా పేరు సంపాదించుకుంది. ఏళ్లు గడిచేకొద్దీ, ఈ కంపెనీ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు, బడ్జెట్ ఆధారిత నార్డ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, వేరబుల్స్, ఆడియో ప్రొడక్టుల్లో తన పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించింది.
అయితే, ఈ వార్తలను వన్‌ప్లస్ లేదా పేరెంట్ కంపెనీ ఒప్పో అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, భారత మొబైల్ మార్కెట్లో మాత్రం వన్‌ప్లస్ తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని వన్‌ప్లస్ ఇండియా స్పష్టం చేసింది.
Read Also : Vivo T5 Lite 5G : వివోనా మజాకా.. ఈ కొత్త వివో 5జీ ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్..
వన్‌ప్లస్ షట్‌డౌన్ అనే ఈ ప్రచారానికి ప్రధాన కారణంగా ఒప్పో గ్లోబల్ రీ-ఆర్గనైజేషన్ అంటున్నారు. సంస్థ అనుబంధ బ్రాండ్లైన వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పోల వ్యాపార వ్యూహాలను పునర్వ్యవస్థీకరిస్తోందని సమాచారం. ఇందులో భాగంగా వన్‌ప్లస్‌ను ప్రధానంగా చైనా మార్కెట్‌కే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇతర నివేదికల ప్రకారం.. 2026 రెండవ త్రైమాసికంలో ఒప్పో షిప్మెంట్లలో గతేడాదితో పోలిస్తే రెండంకెల క్షీణత నమోదైంది.
మరో ముఖ్యమైన కారణం.. పెరుగుతున్న తయారీ వ్యయాలు ఒకటి కాగా, మెమొరీ చిప్‌లు వంటి కీలక పార్టుల ధరలు భారీగా పెరగడంతో వన్‌ప్లస్ నార్డ్ వంటి బడ్జెట్ సిరీస్‌పై లాభాల మార్జిన్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమెరికా, యూరప్ మార్కెట్లలో ఆపిల్, శాంసంగ్‌లతో పాటు గూగుల్ పిక్సెల్, మోటోరోలా వంటి బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడంతో వన్‌ప్లస్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.
అమెరికా ప్రభుత్వం చైనా మొబైల్ బ్రాండ్లపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కొన్ని ప్రొడక్టుల సర్టిఫికేషన్ ఆలస్యమవుతోంది. తద్వారా కంపెనీ గ్లోబల్ విస్తరణపై ప్రభావం పడిందంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే ఆపిల్ కంపెనీతో కొనసాగుతున్న న్యాయ వివాదాలు కూడా కంపెనీపై అదనపు ఒత్తిడి తెచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే, ప్రస్తుతం ఈ నివేదికలకు సంబంధించి వన్‌ప్లస్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. వన్‌ప్లస్ ఇండియా మాత్రం భారత్‌లో కొత్త ప్రొడక్టులు, సాఫ్ట్వేర్ అప్డేట్లు, సేల్స్ తర్వాత సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
