ACB Shamirpet : అబ్బో మేడం గారి ప్లాన్ మాములుగా లేదే.. రూ.30 లక్షల లంచం కేసు.. ACB వలకి చిక్కిన MRO
ACB Shamirpet : రూ. 30 లక్షల లంచే కేసులో శామీర్‌పేట ఎమ్మార్వోని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
- Dharani Pilli
- Updated on- May 27, 2026 / 03:02 PM IST
ACB officials arrest Shamirpet Tahsildar in Rs 2 lakh bribe trap
- ఏసీబీ వలలో శామీర్‌పేట ఎమ్మార్వో
- రూ.30 లక్షల లంచం కేసులో
- రూ.2 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
ACB Shamirpet : ప్రజలకు సేవ చేస్తున్నందుకే ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు జీతం ఇచ్చేది. కానీ కొందరు అధికారుల ఆలోచన తీరు మాత్రం ఇలా ఉండదు. తామేదో ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నట్లు ఫీలవుతారు. వారిని కలవడం మొదలు అవసరమైన సంతకాలు, అనుమతుల కోసం ఇలా ప్రతి దానికి ముడుపులు చెల్లించాలి. అది కూడా వేలు, లక్షల్లో. వీరి తీరు చూసి చిర్రెత్తుకొచ్చిన జనాలు సదరు అధికారుల మీద అవినీతి నిరోధక శాఖ వారికి ఫిర్యాదు చేస్తే.. వారు రంగంలోకి దిగితే ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద లంచగొండి తిమింగలాలు చిక్కుతారు. తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారులు రూ.30 లక్షల లంచం కేసులో ఓ మహిళా ఎమ్మార్వోని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..
ఏసీబీ అధికారులు మంగళవారం శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసి.. ముందుగా రెండు లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్ వ్యవహారంలో.. సదరు ఎమ్మార్వో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది.
*తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి అదిరిపోయే శుభవార్త..
ఈ ఫిర్యాదు ప్రాథమిక విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం 30 ఎకరాలకు గాను రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
*విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గాయ్.. ప్రస్తుత రేట్లు ఇవే..
దీనికి సంబంధించిన ఎమ్మార్వో సుచరితతో పాటు కీసర ఆర్‌డీఓ రాజేష్ సహా పలువురు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇదే శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం 2024లో కూడా లంచం ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఎమ్మార్వో సత్యనారాయణ తన డ్రైవర్‌తో కలిసి రూ.2 లక్షల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడంతో జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
