arun kumar who famous as viral laughing boy meme in internet now passed 10th class
Viral Laughing Boy Meme: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో మీమ్స్ చూస్తుంటాం. అయితే వీటిల్లో కొన్ని ప్రతి వీడియోలో కనిపిస్తాయి. అవి మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, ఏదైనా మూవీలోని సీన్‌ని మీమ్స్‌గా వాడేవే అధికంగా ఉంటాయి. సామాన్యులు చాలా తక్కువగా మీమ్స్‌లో కనిపిస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి.. చేతిలో పేపర్ టీ కప్ పట్టుకుని.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వే కుర్రాడి మీమ్. ఆ కుర్రాడి నవ్వు మీమ్‌ని కొన్ని కోట్ల మంది.. కోట్ల సార్లు చూసి.. హాయిగా నవ్వుకుని ఉంటారు. అక్కడి వరకే. మరి ఆ కుర్రాడు ఎవరు.. ఏం చేస్తుంటాడు అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఈ మధ్య కాలంలో కొందరు యూట్యూబర్లు.. మీమ్స్‌లో చూసే ఆ కుర్రాడి వివరాలు కనుక్కుని వెళ్లి.. అతడి గురించి ప్రత్యేకంగా వీడియోలు చేయడంతో.. అతడి వివరాలు తెలిశాయి. ఆ కుర్రాడు తెలుగువాడే. అతడి పేరు అరుణ్ కుమార్.
మీమ్స్‌లో చూసినప్పుడు.. ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించే ఆ కుర్రాడి జీవితంలో అనేక కష్టాలు. పేదరికం వల్ల నాలుగో తరగతిలోనే చదువు మానేసి పదేళ్లకే పనిలోకి దిగాల్సి వచ్చింది. కుటుంబ పోషణ నిమిత్తం పని కోసం వెతుకుతుండగా.. అరుణ్ కుమార్ కి నెహ్రూ అనే లారీ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు అరుణ్ కుమార్‌ని క్లీనర్‌గా పనిలో పెట్టుకున్నాడు. పని చేసుకుంటూ సాగుతున్న అరుణ్ కుమార్ జీవితాన్ని ఓ టీ బ్రేక్ మార్చేసింది.
నెహ్రూ, అరుణ్ కుమార్ టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా.. ఏదో విషయానికి అరుణ్ కుమార్ సంతోషంతో గట్టిగా నవ్వే దృశ్యాన్ని అతడి బాస్ నెహ్రూ వీడియో తీసి.. ఆ క్లిప్‌ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో.. రాత్రికి రాత్రే గ్లోబల్ సెన్సేషన్ పుట్టుకొచ్చాడు. నాటి నుంచి ఎందరో అరుణ్ కుమార్ మీమ్‌ని విపరీతంగా వాడేశారు. వైరల్ లాఫ్ బాయ్‌గా ఇంటర్నెట్‌లో అరుణ్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచం అంతా అరుణ్ నవ్వుతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ.. అతడిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేసినా.. అరుణ్ వాటిని చదవగలిగే పరిస్థితిలో లేడు.
ఇంటర్నెట్ అంతా అతడిని మీమ్‌గా వాడుకుంటున్నా.. నెహ్రూ మాత్రం అరుణ్ కుమార్‌కి ఓ మార్గదర్శిగా నిలిచాడు. కుటుంబ పోషణ కోసం నెహ్రూ కూడా కాలేజీ మధ్యలోనే మానేసి పనిలోకి వెళ్లాడు. చదువు ఆగిపోతే జీవితం ఎలా ఉంటుందో అతడి కన్నా బాగా ఎవరికి తెలుసు? అరుణ్ కుమార్ కూడా తనలాంటి పరిస్థితిలోనే ఉండటం నెహ్రూని కదిలించింది. అందుకే అరుణ్ కుమార్ కూడా తనలా చదువు మధ్యలోనే ఆపేయకుండా చూడాలని భావించి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అరుణ్ ని చదివించాలనుకున్న నెహ్రూ తన సొంత డబ్బులతో అతడికి ఫీజులు కడుతూ.. పుస్తకాలు కొనిపించాడు. ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్‌కు దగ్గరుండి దరఖాస్తు చేయించాడు.
అరుణ్ పరీక్షలకు చదువుకోవడం కోసం.. వారి ట్రక్ క్యాబిన్ మొబైల్ తరగతి గదిగా మారింది. సుదూర ప్రయాణాల మధ్య, నెహ్రూ అరుణ్‌కు వర్ణమాల, గణితానికి సంబంధించి ప్రాథమిక సూత్రాలను నేర్పించాడు. ప్రపంచం అంతా అరుణ్ కుమార్‌ని ఓ 12 సెకన్ల మీమ్‌గా చూడటానికి అలవాటు పడగా.. నెహ్రూ మాత్రం అతడు జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. అరుణ్ ని చదివించాలని తీసుకున్న నిర్ణయం, అతడి సంకల్పం నెరవేరింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో అరుణ్ కుమార్ పదో తరగతి పాస్ అయ్యాడు.
18 ఏళ్ల అరుణ్ ఇప్పుడు ఓ మీమ్ మాత్రమే కాదు.. అవిశ్రాంతిగా కృషి చేస్తే అదృష్టం వరిస్తుంది అనే దానికి నిదర్శనంగా నిలిచాడు. ఇంటర్నెట్‌లో చాలా మంది యూట్యూబర్లు అతడిని మీమ్ గా, తమ వీడియో కంటెంట్‌గా చూడగా.. నెహ్రూ మాత్రం వారందరికీ భిన్నంగా అరుణ్ కుమార్ జీవితానికి ఓ గురువుగా నిలిచి.. అతడి ప్రయాణాన్ని సరైన దిశకు మార్చే దిక్సూచిగా నిలిచాడు. నెహ్రూ సంకల్పం, అరుణ్ కుమార్ కష్టపడే తత్వం వల్ల అతడు లారీ క్లీనర్ నుంచి నేడు పదో తరగతి పాస్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్నాడు.