Telangana Govt Holidays : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు.. కారణమిదే
Telangana Govt Holidays : తెలంగాణ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలలో పలు తేదీల్లో సెలవులు ప్రకటించింది. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : April 4, 2026 / 06:38 PM IST
assembly elections 2026 telangana govt announced paid holidays for Polling states voters and employees
- ఏప్రిల్ లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు పెయిడ్ హాలీడే
- ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Govt Holidays : తెలంగాణ సర్కార్ ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. వారికి ఏప్రిల్ 9, 23, 29 తేదీల్లో సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకూ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. ఏప్రిల్ నెలలో దేశంలోని నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో నివసిస్తున్న ఆయా రాష్ట్రాల వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు, వారి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ.. వారి కోసం సర్కార్ ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం, కేరళ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎవరైతే.. తెలంగాణలో ఉద్యోగం, ఇతర పనుల నిమిత్తం స్థిరపడ్డారో.. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు గాను రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలవులు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాక.. ప్రైవేటు రంగాల్లో పనిచేసే వారికి కూడా వర్తిస్తాయని తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, పలు ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలతో పాటు.. ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన పైన పేర్కొన్న ప్రాంతాలకు చెందిన కార్మికులకు, ఉద్యోగులకు పోలింగ్ రోజున ‘పెయిడ్ హాలిడే’ (Paid Holiday) ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి సొంత రాష్ట్రాలకు వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎలాంటి కోత విధించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
సెలవుల వివరాలు:
- అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఓటర్ల కోసం ఏప్రిల్ 9వ తేదీన సెలవు.
- తమిళనాడు ఓటర్ల కోసం ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక సెలవు వర్తించనుంది.
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వివిధ దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఆ రాష్ట్ర ఓటర్ల కోసం ఏప్రిల్ 23, 29 తేదీల్లో సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
