Bandi Sanjay Son Case : బండి సంజయ్ కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్.. డీజీపీకి సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. మహిళా ఐపీఎస్ పర్యవేక్షణలో
Bandi Sanjay Son Case : బండి సంజయ్ కొడుకుపై నమోదైన పోక్సో కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 02:59 PM IST
bandi sanjay son case cm revanth reddy key orders to dgp anand and formed SIT
Bandi Sanjay Son Case : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో (POCSO) కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల తీరుపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 8న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే.. ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని సీఎం ప్రశ్నించారు. పోలీసుల అలసత్వంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలానే ఈ కేసు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం రేవంత్ డీజీపీని అడిగి తెలుసుకున్నారు.
*కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు..
ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ కేసు వివరాలను తెలిపారు. ఆదివారం నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధుల్లో ఉన్నారని.. అందుకే చర్యలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగిందని డీజీపీ ఆనంద్ ముఖ్యమంత్రికి వివరించారు. డీజీపీ వివరణ విన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసు సమగ్ర, నిష్పక్షపాత విచారణ కోసం తక్షణమే ప్రత్యేక పోలీస్ బృందాలను (Special Teams) ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
ఈ కేసు దర్యాప్తులో ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ (SIT) ఏర్పాటు చేయడంతో పాటు మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
