Telangana Farmers : తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. 365 మండలాల్లో రుణాల వసూళ్లకు బ్రేక్!
Telangana Farmers : తెలంగాణలో కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భారీ ఊరట లభించనుంది.
Telangana Farmers
Telangana Farmers : తెలంగాణలో కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భారీ ఊరట లభించనుంది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో రైతులు తీసుకున్న పాత రుణాల వసూళ్లను 12 నెలల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. రుణాలు తిరిగి చెల్లించేందుకు రైతులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు గడువు కల్పించనుంది. దీంతో అప్పుల చెల్లింపుల విషయంలో రైతులకు కొంత ఉపశమనం లభించనుంది.
రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు బ్యాంకర్లు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లతో మాట్లాడారు. కరువు కారణంగా పంటలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న రైతుల నుంచి ప్రస్తుతం ఉన్న రుణాలను వెంటనే వసూలు చేయకుండా మారటోరియం అమలు చేయాలని కోరారు. అలాగే రానున్న రబీ సీజన్లో సాగు పనుల కోసం రైతులకు కొత్త రుణాలు కూడా ఇవ్వాలని సూచించారు.
బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఓ మోస్తరు కరువు ఉన్న 254 మండలాల్లో రైతుల రుణాల వసూళ్లను 12 నెలల పాటు నిలిపివేస్తారు. ఈ రుణాలను తిరిగి చెల్లించేందుకు రైతులకు 36 నెలల గడువు కల్పిస్తారు. అంటే మూడేళ్లలోపు రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. అదే తీవ్ర కరువు పరిస్థితులు ఉన్న 111 మండలాల్లోనూ 12 నెలల పాటు రుణాల వసూళ్లు నిలిపివేస్తారు. అయితే ఈ మండలాల రైతులకు రుణాల చెల్లింపునకు 60 నెలల గడువు ఇవ్వనున్నారు. అంటే ఐదేళ్లలోపు రుణాలు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మారటోరియం కోసం రైతులు ప్రత్యేకంగా ముందుకొచ్చినా, రాకపోయినా బ్యాంకులే అర్హులైన రైతులను గుర్తించి ఉపశమన చర్యలు చేపట్టనున్నాయి. రైతుల బ్యాంకు ఖాతాలను పరిశీలించి అర్హులకు మారటోరియం అమలు చేయడంతో పాటు రబీ సీజన్‌కు కొత్త రుణాలు కూడా మంజూరు చేయనున్నారు.
మారటోరియం అమలయ్యే 12 నెలల కాలానికి రైతుల రుణాలపై పడే వడ్డీ భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆ వడ్డీని రాయితీ రూపంలో సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల వివరాలను 15 రోజుల్లోగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సీఐఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది.
