BRS MLA Malla Reddy : రేవంత్ ని సీఎం చేసింది నేనే.. ముఖ్యమంత్రి కావాలని ఉంది : మల్లా రెడ్డి
BRS MLA Malla Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 01:05 PM IST
brs mla malla reddy comments on cm revanth reddy and ustad bhagat singh media chat chat
BRS MLA Malla Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. అసెంబ్లీ లాబీ వద్ద మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తానే అన్నారు. సీఎంతో తన అనుబంధం మొదలు సినిమాల్లో నటించాలనే తన కోరిక వరకు ఇలా పలు అంశాలపై ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. రేవంత్ రెడ్డిని సీఎంని చేసింది తానే అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్‌రెడ్డి తప్ప మరో పవర్ ఫుల్ నేత లేడని.. తాను గతంలో నిర్వహించిన రెడ్డి సంఘం సమావేశంలో వెల్లడించానని అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ ఒక్కరే బలమైన నేత అని తాను ఆనాడే నొక్కి చెప్పినట్లు మల్లారెడ్డి గుర్తు చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎవరు అవునన్నా.. కాదన్నా.. తాను, రేవంత్ రెడ్డి ఇద్దరం అన్నదమ్ములమే అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
సినిమాల గురించి కూడా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా దర్శకుడు హరీశ్ శంకర్ తననే అడిగారని తెలిపారు. అయితే తాను ఆ విలన్ పాత్రకు అంగీకరించలేదని వెల్లడించారు. నిజ జీవితంలో కాకపోయినా.. కనీసం తెర మీద అయినా ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని తనకు ఎప్పటి నుంచో ఆశగా ఉందన్నారు.
మల్లారెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. మల్లారెడ్డి విలన్ పాత్రకే సెట్ అవుతాడని.. ఒకవేళ ఆయన సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చేయాలన్నారు. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
