Preethi Reddy : బీజేపీ ఆఫీసుకి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి.. పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. అసలు మ్యాటర్ ఇదే..!
Preethi Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి కోడలు ప్రీతి రెడ్డి నేడు బీజేపీ ఆఫీసుకు వెళ్లడం సంచలనంగా మారింది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 02:18 PM IST
BRS MLA malla reddy daughter in law Preethi Reddy visit bjp office in hyderabad
- బీజేపీ ఆఫీసుకి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి
- పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం
- ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి
Preethi Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 24, శుక్రవారం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేడు బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ అంశం కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి పార్టీ మార్పు అంశంపై అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇటీవలే మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో సహా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నేడు స్వయంగా ప్రీతి రెడ్డి బీజేపీ ఆఫీసుకు రావడంతో పార్టీ మార్పు వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది.
ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారంనాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లి.. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. అయితే..
ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతూ పార్టీ మారబోతున్నారంటూ సాగుతున్న ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెర దించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘మల్లారెడ్డి డిజిటల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాము. ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కూడా ఆహ్వానించడానికే ఇక్కడకు వచ్చాను. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. విద్యావేత్తగా ఒక పెద్ద క్యాంపస్ ఓపెనింగ్‌కి అందరినీ కలుస్తున్నాను. మేం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము.. ఇక పై ఉంటాం కూడా. ఒక విద్యావేత్తగా అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నాను. మోదీ మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. ఆయన పర్యటనకు సంబంధించి ఇంకా తేదీ ఖరారు కాలేదు. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది బీజేపీ నినాదం.. అలానే ప్రతి ఇండియన్ నినాదం” అన్నారు.
ఇదిలా ఉంటే త్వరలోనే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించబోతున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ కానుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి మీడియాకు తెలిపారు.
