CM Revanth Reddy : నాతో పాటు ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

పదే పదే ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. అంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామన్నారు.

CM Revanth Reddy : నాతో పాటు ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Sensational Comments

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనతో పాటు అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే.. తెలంగాణ సాయుధ పోరాట యోధులు గుర్తుకువస్తారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ.. ఇక్కడ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్‌లో తెలంగాణ వాదం వినిపించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని చెప్పారు.

తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదులుకున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సేవలో నిమగ్నమయ్యారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దొర గడిలో సారా బోసి కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకులుగా కాలేదన్నారు. నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అలానే ఉన్నానని చెప్పారు.

అందుకే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి :
దొర గడిలో బందీగా ఉన్న తెలంగాణ తల్లిని విడపిస్తున్నామని పేర్కొన్నారు. కమ్యూనిస్టు సోదరులను అవసరం ఉన్నప్పుడు వాడుకొని తర్వాత కరివేపాకులా వదిలేయలేదాని రేవంత్ ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం స్వేచ్ఛగా అమలు కావాలి అంటే.. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చినప్పుడు సీఏఏ చట్టం తెచ్చినప్పుడు.. ఇలా ప్రతిసారి కేసీఆర్ మోడీకి మద్దతు ఇచ్చారని విమర్శించారు.

100 రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలి అనడం న్యాయమా కేసీఆర్?అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన అని నిరుద్యోగులను మోసం చేసి సొంత కుటుంబ సభ్యులకు మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చారని రేవంత్ మండిపడ్డారు. నిరుద్యోగుల పరీక్ష పత్రాలను మాత్రం అమ్ముకున్నారని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలో భువనగిరి సెంటర్‌లో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించామని, పేదలకు వైద్య సహాయం కోసం ఆరోగ్యశ్రీ పరిమితి పెంచామన్నారు. వంద రోజుల్లోనే ఐదు పథకాలు అమలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడితే ఉరికించి కొడతాం :
పదే పదే ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. అంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామన్నారు. రాష్ట్ర అవతరణను తప్పు పట్టిన బీజేపీ కి ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పారు. భువనగిరిలో క్యామను ముందు పెట్టి వెనక బూర ఊదుతుండు కేసీఆర్ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. రాజగోపాల్, వెంకట్ రెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్ అన్నారు.

చామల కిరణ్ ను 3లక్షల మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మూసీని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుంచి విముక్తి చేసే బాధ్యత నాదన్నారు. గంధమల్ల, బ్రాహ్మణ వెల్లం, ఎస్ఎల్బీసీ పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ పాపం ఎవరిది.. మీది కాదా? అని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా జాప్యం చేసి తాగునీరు అందకుండా చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.

పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది..:
చామల కిరణ్‌ను గెలిపిస్తే.. భువనగిరిని ట్రిపుల్ ఇంజన్‌లా అభివృద్ధి చేస్తారని చెప్పారు. అంతేకాదు.. చామల కిరణ్‌ను గెలిపిస్తే.. యదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుకుందామన్నారు. ‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.. వచ్చే పంటకు రూ.500 బోనస్ అందించే బాధ్యత నాది..’ అంటూ రేవంత్ భరోసా ఇచ్చారు.