CM Revanth Reddy : సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం : సీఎం రేవంత్
CM Revanth Reddy : సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నేతన్నల సమస్యలు, కార్మికుల వలసలు, కాళేశ్వరం ముంపు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- Sreehari A
- Published on- September 30, 2026 / 08:50 PM IST
CM Revanth Reddy
CM Revanth Reddy : సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్ పాలన, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2009 నుంచి కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు గెలిపిస్తున్నా నేతన్నల ఆత్మహత్యలు, కార్మికుల గల్ఫ్ వలసలను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు.
కేటీఆర్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసి సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. 2009 నుంచి 2026 వరకు ఆరుసార్లు ప్రజలు గెలిపించినా నేత కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆరోపించారు.
‘సిరిసిల్ల సమస్యలకు నిలయం కాలేదు.. మార్చారు’ అని రేవంత్ అన్నారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని, ధైర్యం, దైవం కలిసి వెలిసిన ప్రాంతమని పేర్కొన్నారు. ప్రజల వేలాది ఓట్లను పచ్చనోట్లుగా మార్చుకున్నారని ఆరోపించారు.
నేత కార్మికుల కోసం పదేళ్లలో బీఆర్‌ఎస్ రూ.2,234 కోట్లు ఖర్చు చేస్తే.. రెండున్నరేళ్ల ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,731 కోట్లు ఇచ్చిందని రేవంత్ తెలిపారు. రెండున్నరేళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు.
‘వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడీని బద్దలు కొడదాం. గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం. ఇదే కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిజ్ఞ’ అంటూ సీఎం పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి బిడ్డను మండలికి పంపాలని, సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని వెల్లడించారు. రేవంత్, మహేశ్ గౌడ్ జోడీతో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు.
