Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ‘టీఆర్ఎస్’ పేరుపై అభ్యంతరాలు.. ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచన!
Kavitha : ఈసీ సూచించిన విధంగా టీఆర్ఎస్ పేరు లేకుండా పార్టీ పేరు ఉండాలి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచించింది.
Kavitha
Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు కోసం కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు టీఆర్ఎస్ అనే పేరు లేకుండా పార్టీ పేరు ఉండాలని సూచించింది. అలాగే పార్టీ పేరు విషయంలో కూడా ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని దానికి ప్రత్యామ్నాయ పేర్లను కూడా సూచించాలని ఆదేశాల్లో పేర్కొంది.
జూన్ 23న లేఖ ఎన్నికల కమిషన్ జారీ చేసింది. అందులో ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని, ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితను కోరింది. దీనిపై సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుందని పేర్కొంటూ నిరాకరించింది.
విచారణలో భాగంగా ‘తెలంగాణ రక్షణ సమితి’ పేరుతో పాటు ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ పేరును పోలి ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈసీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు గడువులోగా పూర్తి వివరణ ఇవ్వాలని, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ప్రత్యామ్నాయ పేర్లను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని సూచించింది.
అయితే, కవిత తరఫు లాయర్లు పార్టీ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని కోర్టుకు విన్నవించారు. అంతేకాదు.. ఈ అంశంపై వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించలేదని వాదించారు. తాము అన్ని నిబంధనలను పాటిస్తూ చట్టబద్ధంగానే వ్యవహరించినట్టు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
వాదనలు అనంతరం ఢిల్లీ హైకోర్టు ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని, అలాగే పార్టీ పేరు విషయంలో కూడా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కవితకు స్పష్టం చేసింది.
