Escaped Convict: పెరోల్‌పై వచ్చి పారిపోయిన ఖైదీ.. ఏకంగా గవర్నమెంట్ టీచర్ అయ్యాడు.. 40 ఏళ్ల తర్వాత పట్టుకున్న పోలీసులు
పెరోల్‌పై బయటకు వచ్చిపోయిన ఒక జీవిత ఖైదీ(Escaped Convict) ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు.
Escaped convict works as government teacher gets best teacher award
- పెరోల్ పై తప్పించుకున్న ఖైదీ
- ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్
- 40 ఏళ్ల తర్వాత జైలుకు
Escaped Convict: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి 40 ఏళ్ల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చి కనిపించకుండా పోయిన ఒక జీవిత ఖైదీ (Escaped Convict)కరడుగట్టిన నేరస్థుడిలా దాక్కోకుండా ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి సేవలు అందించిన విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. 1983లో జీవిత ఖైదు శిక్ష పడిన సందెల వీరన్న అనే ఖైదీ పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు లొంగిపోలేదు. ఊహించని విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి, ఎలాంటి అనుమానం రాకుండా దశాబ్దాల పాటు విధులు నిర్వహించడం పోలీసు వ్యవస్థనే ఆశ్చర్యపరిచింది.
ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు – 13 ఏళ్ల క్రితమే పదవీ విరమణ:
ఖైదీగా పరారైన వీరన్న మహబూబాబాద్ జిల్లాలోనే నివాసముంటూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 2004లో ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉపాధ్యాయుడి’ అవార్డును కూడా స్వీకరించిన అతను 2013లో పదవీ విరమణ పొందాడు. దాదాపు 40 ఏళ్ల 58 రోజుల పాటు పోలీసుల కంటికి చిక్కకుండా తిరిగిన ఇతడిని ఎట్టకేలకు 2024 మే నెలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
హైకోర్టు తీవ్ర గ్రహింపు – పిటిషన్ కొట్టివేత:
శిక్ష మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఖైదీ భార్య వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇన్నాళ్లూ నిందితుడిని పట్టుకోకపోవడం జైళ్ల శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లే ఖైదీలపై పటిష్టమైన నిఘా ఉంచేందుకు వీలుగా ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థను, ప్రత్యేక మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని జైళ్ల శాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
