Fire Accident : రైతన్న గుండెల్లో మంటలు.. 100 ఎకరాల్లో కాలి బూడిదైన పంట..

Fire Accident : ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల 100 ఎకరాల్లో పంట కాలి బూడిదయ్యింది.

Fire accident in adilabad both corn crop burn around 100 acres

Fire Accident : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల వల్ల సుమారు 100 ఎకరాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదవ్వడం చూసిన అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కన్నబిడ్డల్లా సాక్కున్న పంట అగ్గి పాలైందని విలపిస్తున్నారు. ఈ సంఘటన బోథ్ మండలం కన్గుట్ట గ్రామంలో ఆదివారం నాడు చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలకు చేతికొచ్చిన మొక్కజొన్న పంటా కాలి బూడిదైపోయింది.

ముందు ఒక చేనులో మొదలైన మంటలు చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర పొలాలకు శరవేగంగా వ్యాపించాయి. ఏం జరిగిందో తేరుకునేలోపే.. కాపుకొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదయ్యింది. ఈ ఘోర అగ్నిప్రమాదం వల్ల సుమారు వంద ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కన్గుట్ట గ్రామంలో ప్రారంభమైన మంటలు పొరుగునే ఉన్న బోథ్, సాకెరా గ్రామ శివార్లకు వేగంగా వ్యాపిస్తున్నాయి. వేసవి కాలం, పైగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి, స్థానికులకు కష్టతరంగా మారింది. వేల రూపాయల పెట్టుబడి పెట్టి, రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్ల ముందే బుగ్గిపాలవుతుండటంతో అన్నదాతల బాధ వర్ణనాతీతంగా ఉంది. మంటలు మరింత విస్తరించకముందే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.