Jagga Reddy: సోనియా గాంధీ జీవితంపై భారీ మూవీ.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బీలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తెలుగులో సినిమాను ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( Jagga Reddy) ప్రకటించారు.
Former mla jagga reddy announces biopic on sonia gandhi in telugu
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత ఆధారంగా రాసిన ఆత్మకథ ‘బీలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా తెలుగులో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jagga Reddy)సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్-ప్రియాంకలకు తల్లిగా ఆమె సాగించిన వ్యక్తిగత జీవిత ప్రయాణంతో పాటు ఎదుర్కొన్న అనేక రాజకీయ సవాళ్లను ఈ సినిమా ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
త్యాగపూరిత రాజకీయ ప్రస్థానం.. ప్రధాని పదవినే తృణప్రాయంగా త్యజించిన ధీరవనిత:
సోనియా గాంధీది అత్యంత విజయవంతమైన, త్యాగపూరితమైన రాజకీయ జీవితమని జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధానమంత్రి అయ్యే గొప్ప అవకాశం వచ్చినప్పటికీ ఆమె పదవిపై ఎలాంటి వ్యామోహం చూపలేదని గుర్తుచేశారు. భర్త రాజీవ్ గాంధీ అకాల మరణం తర్వాత పీవీ నరసింహారావును, ఆ తర్వాత యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఘనత ఆమె త్యాగానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాల్లో సోనియా గాంధీ వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
స్వచ్ఛంద నిధులతో సినిమా నిర్మాణం.. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ల చేతుల మీదుగా ప్రారంభం:
ఈ ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణానికి కావలసిన నిధులను సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే స్వచ్ఛందంగా సమకూరుస్తారని, వారే ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.
