Jayalalithaa Building Seized :మాజీ సీఎం జయలలిత ఇంటిని సీజ్ చేసిన GHMC అధికారులు..

Jayalalithaa Building Seized : నగరంలో ఉన్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటిని సీజ్ చేశారు.

ghmc officials seized jayalalithaa building in yusaf guda over property tax arrears

Jayalalithaa Building Seized : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు చెందిన పలు ఆస్తులు హైదరాబాద్‌ లో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు.. నగరంలో ఉన్న జయలలితకు చెందిన ఒక భవనాన్ని సోమవారం సీజ్‌ చేశారు. ఈ బిల్డింగ్.. యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-38 పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో ఉంది. జీ+4తో నిర్మించిన ఈ బిల్డింగ్ ఇంటి నంబరు 8-3-1099/ఎ (పీటీఐఎన్‌ నంబరు: 1100833474) జె. జయలలిత పేరుతో ఉంది.

2017 సంవత్సరం నుంచి ఈ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్‌ గత నెలలోనే (ఫిబ్రవరిలో) ఆస్తి పన్ను బకాయిల గురించి జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులిచ్చారు. నెల రోజులు దాటినా వారు స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఏఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం నాడు జయలలిత బిల్డింగ్‌ను సీజ్ చేశారు.

ఇదిలా ఉంటే.. జీహెచ్‌ఎంసీ అమలు చేస్తోన్న ఓటీఎస్‌ (OTS) స్కీమ్‌ మార్చి 31 వరకు అమలులో ఉన్నందున, ఈ బిల్డింగ్ మీద ఉన్న ఆస్తి పన్నులో రాయితీ పోను రూ. 82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఈ బిల్డింగ్‌లో ప్రైవేటు ఆఫీసు ఉండటంతో.. వాణిజ్య సముదాయం కింద ఆస్తి పన్ను విధించారు. అయితే 2017 సంవత్సరం నుంచి ఈ బిల్డింగ్‌ను నివాసానికి వాడుకుంటున్నందున రెసిడెన్షియల్‌గా మార్పు చేయాలని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్‌ జయకుమార్‌ గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు.