Telangana Govt : తెలంగాణలోని రైతులకు శుభవార్త.. రూ.20 లక్షల వరకు సబ్సిడీ.. ఇక ఆ ఇబ్బందులకు చెక్..
Telangana Govt : తెలంగాణలోని రైతులకు సాగు ఖర్చులు తగ్గించడంతోపాటు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Good News for Telangana Farmers Drones and Modern Farm Equipment at Low Rental Costs
Telangana Govt : రైతులకు సాగు ఖర్చులు తగ్గించడంతోపాటు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామస్థాయిలోనే తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,302 సంఘాలు దరఖాస్తు చేసుకున్నాయి.
ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. అయితే వీటి అద్దెలు చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారుతున్నాయి. ఉదాహరణకు ఓ రైతు తన పొలంలో పిచికారీ కోసం డ్రోన్‌ను వినియోగించగా గంటకు రూ.4 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గ్రామస్థాయిలోనే డ్రోన్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అద్దెకు అందించాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఈ కేంద్రాలకు అవసరమైన యంత్ర పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. ఎంపికైన సంఘాలు యంత్రాలను కొనుగోలు చేసిన తర్వాత మొత్తం వ్యయంలో 40శాతం సబ్సిడీగా అందిస్తారు. ఈ రాయితీ గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఉంటుంది.
కనీసం మూడేళ్ల క్రితం ఏర్పాటై, అప్పటి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్న ఎఫ్పీఓలు, పీఏసీఎస్‌లు, మహిళా సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సొంత భవనాలు ఉండటం తప్పనిసరి. అర్హతలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం కేంద్రాలను మంజూరు చేస్తుంది. ఎంపికైన సంఘాలకు యంత్రాల నిర్వహణ, అద్దెల నిర్ణయం, మరమ్మతులపై వ్యవసాయశాఖ శిక్షణ ఇవ్వనుంది.
ఈ కేంద్రాల పనితీరును జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. రైతులకు అందించే యంత్రాల అద్దె ధరలను కూడా ఈ కమిటీయే నిర్ణయిస్తుంది. దీంతో అధిక అద్దెలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రైతులు ఖరీదైన యంత్రాలను సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైనప్పుడు తక్కువ అద్దెకు తీసుకుని వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న చిన్న, సన్నకారు రైతులకు ఈ విధానం ఉపయోగకరంగా మారనుంది.
