Minister Seethakka: బూడిదలో పోసిన పన్నీరు..! మంత్రి గారు ఒకటి తలిస్తే మరొకటి జరిగిందా? మేడారం జాతరలో ఎందుకిలా
కొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే వీఐపీలు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సేవలో తరించేందుకే టైమ్ కేటాయించారట. మరికొందరు యంగ్ ఆఫీసర్లు జాతరను పక్కన పెట్టి రీల్స్ కోసం పడ్డ తపన, ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్టుల కోసం పడ్డ ఆరాటం అంతా ఇంత కాదట.
Danasari Seethakka Representative Image (Image Credit To Original Source)
- మేడారం జాతరలో అన్నీ తానై వ్యవహరించిన సీతక్క
- జన జాతర బాధ్యతలను భుజాలపై వేసుకున్న మంత్రి
- కొందరు అధికారుల తీరే భక్తుల ఇబ్బందులకు కారణమా?
- మంత్రి గారి కోటరీనే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిందా?
Minister Seethakka: మహా జాతర. లక్షలాది మంది జనం. అన్నీ తానై వ్యవహరించిన మంత్రి గారు. తన నియోజకవర్గం. ఆమె సామాజికవర్గ కీర్తి కిరీటమైన అతిపెద్ద గిరిజన జాతర. పైగా జిల్లా మంత్రి. ఇలా అన్నీ కలగలిసి..అన్నీ తానై..జాతర నిర్వహణను భుజాలపైన వేసుకున్నారామె. ఔట్ రైట్‌గా తనకు, ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని కూడా భావించారట. కట్ చేస్తే కొందరు అధికారుల అతి..మరికొందరి నిర్లక్ష్యం కాస్త భక్తుల ఇక్కట్లకు కారణమైందట. మంత్రి గారు ఎంతో శ్రమించినా.. ఫైనల్ ఔట్ పుట్ మాత్రం డిసప్పాయింట్ చేసిందట. ఇంతకు ఎవరా మంత్రి? ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు రీచ్ కాలేదు?
తెలంగాణ కుంభమేళా..జన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గ్రాండ్‌గా జరిగింది. తను పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకునేందుకు..ములుగు ఎమ్మెల్యేగా, జిల్లా మంత్రిగా..తన సామాజిక వర్గ ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ జాతరను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు మంత్రి సీతక్క. ఇదే ఉమ్మడి ఓరుగల్లు జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయినా ఆమె జాతరలో ఎక్కడా పెద్ద హడావుడి చేసినట్లు కనిపించలేదు. సీతక్క మాత్రం ప్రభుత్వం తరఫున అన్నీ తానై..మేడారంలోనే మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు. అయితే కరెక్ట్ జాతర జరిగే మూడు రోజుల్లో..అమ్మవార్లు గద్దెల మీదకు వచ్చిన సందర్భంలో తలెత్తిన సమస్యలు..భక్తులు పడ్డ ఇబ్బందులు చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు, భక్తుల ఆందోళనలు, ఆవేదనలు, తిట్ల దండకం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
అంతా డీఎస్పీ, సీఐ ప్లాన్ ప్రకారమే?
అటెండర్ నుంచి మొదలు ఆఫీసర్ వరకు 40 వేల మంది సిబ్బంది పని చేసిన మేడారం జాతరలో..మంత్రి సీతక్క ఆలోచనకు, ప్రభుత్వ లక్ష్యానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా మారిపోయిందట సీన్. కొంతకాలంగా మంత్రి గారి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ కోటరీ అడ్డుగోడ కట్టేసిందట. ఆ వర్గానికి చెందిన డీఎస్పీ, సీఐ ప్లాన్ ప్రకారం తమ అనుచరులైన అధికారులను ములుగు నిండా నింపేశారని పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విప్లవ రాజకీయాలకు నెలవైన మేడారం ప్రాంతంలో నెత్తురు చిందించిన అమరుడి స్తూపం జాతర ఏర్పాట్లలో రంగు మారడం, విప్లవ నేపథ్యం ఉన్న సీతక్క మంత్రిగా ఉన్న చోటు ఇలా జరగడం హాట్ టాపిక్ అయింది. పోలీస్ శాఖలో వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న ఓ సీఐ, లోకల్‌గా పట్టుండి బాగా ముదిరిన డీఎస్పీ మంత్రి చుట్టూ చేరి తమ హవా నడిపించారట. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గద్దెల సాక్షిగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకు రాచ మర్యాదలు చేసి ఆశ్చర్యపరిచారట.
ఐపీఎస్ అధికారి టీమ్ హంగామా..!
ఎత్తైన తోరణాలు..వెయ్యేళ్ల చరిత్ర మేడారం గద్దెలపై ప్రతిబింబిస్తోందని గర్వపడాలో..? అమ్మల ప్రాంగణంలో అనుమతి లేదన్న ఆంక్షలకు బాధపడాలో? తెలియక ఆదివాసీ గిరిజన పూజారులు మదనపడిపోయారట. వన దేవతల సన్నిధికి తమను దూరం చేయొద్దని పూజారులే ప్రాధేయపడటం చర్చకు దారితీసింది. సారలమ్మ సన్నిధిలో ప్రతీసారి కోయ సంప్రదాయ నృత్యంలో..మంత్రి సీతక్క, కోయ ఆడబిడ్డలు హైలెట్ అవుతుంటారు. కానీ దీనికి భిన్నంగా ఐపీఎస్ అధికారుల డ్యాన్స్‌లు, ఓ ఐపీఎస్ అధికారి టీమ్ చేసిన హంగామాపై తీవ్ర చర్చ జరుగుతోంది. సమ్మక్కను చిలుకలగట్టు నుంచి తీసుకొచ్చేప్పుడు వినమ్రంగా ప్రణమిల్లాల్సిన చోట ఐపీఎస్‌ల హుందాతనం హుష్ కాకి అయిందన్న విమర్శలున్నాయి.
జనానికి నరకం చూపిన జన జాతర?
ఇక ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు పూర్తిగా అదుపు తప్పిందన్న అలిగేషన్స్ వచ్చాయ్. డ్రోన్లు, టీజీ క్వెస్ట్, హైటెక్ హంగులు చేతులెత్తేయడంతో..రోజుల తరబడి ప్రయాణం, గంటల కొద్దీ నిరీక్షణ, బస్సుల్లో బసలు, రోడ్ల పక్కన నిద్రలు, చలిని తట్టుకునేందుకు క్యాంప్ ఫైర్లతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జన జాతర కాస్త జనానికి నరకం చూపిందన్న ఆరోపణలు వచ్చాయి. పోలీస్ మొబైల్ పార్టీలు, ఔట్ పోస్టులు, స్పెషల్ స్క్వాడ్స్, కల్వర్ట్ కో కానిస్టేబుల్, పెట్రోలింగ్ వ్యవస్థ అంతా గాలికొదిలేయడంతో జాతరలో భక్తులు ఇబ్బంది పడాల్సి వచ్చిందంటున్నారు.
రీల్స్ కోసం పోలీస్ ఆఫీసర్ల ఆరాటం..!
కొందరు పోలీస్ ఆఫీసర్లు అయితే వీఐపీలు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సేవలో తరించేందుకే టైమ్ కేటాయించారట. మరికొందరు యంగ్ ఆఫీసర్లు జాతరను పక్కన పెట్టి రీల్స్ కోసం పడ్డ తపన, ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్టుల కోసం పడ్డ ఆరాటం అంతా ఇంత కాదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువ ఐఏఎస్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రైనీగా పని చేసిన మరో యువ ఐపీఎస్ తమ బ్యాచ్‌తో కలిసి చేసిన హల్చల్ అధికారిక వర్గాలనే ముక్కున వేలేసుకునేలా చేసిందట. గద్దెల మీదనే భక్తులపై పిడిగుద్దుల ప్రతాపం చూపించడం విమర్శల పాలు చేసింది.
అడుగడుగునా భక్తులు అవస్థలు పడుతుంటే..మంత్రి నమ్ముకున్న స్పెషల్ అధికారులంతా..ఆల్ ఈజ్ వెల్ అని.. ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగిస్తూ..ఫీడ్ బ్యాక్ ఇచ్చి సీతక్కను గుక్క తిప్పుకోనివ్వలేదట. నిజమేనని నమ్మిన అమాత్యురాలు, మిగతా జాతర పనుల్లో బిజీ అయిపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందట. ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ మినిస్టర్ చెవిన పడేదాకా సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదట. 250 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది..భక్తులతో శభాష్ అనిపించుకోవాలనుకుంటే.. ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే రిజల్ట్ మరోలా వచ్చిందట. ప్రభుత్వం ప్రతిష్ట మాట అటుంచి భక్తుల తిట్లు, శాపనార్ధాలు మిన్నంటడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయిందట పరిస్థితి. మంత్రి గారు కొందరు అధికారుల మాటలను అతిగా విశ్వసించడంతోనే ఈ సమస్యలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది.
Also Read: లాక్కొని రాలేదుగా.. మనమేం దైవాంశ సంభూతులం కాదు- కేసీఆర్ సిట్ విచారణపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
