Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దసరా నాటికి ఫేజ్-1 స్వాధీనం.. డెడ్లైన్ ఫిక్స్
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
hyderabad metro phase 1 takeover by telangana government by dussehra
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే దసరా నాటికి మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ అండ్ టి (L&T) సంస్థకు ఉన్న రూ.13,600 కోట్ల బ్యాంక్ రుణాలను ప్రభుత్వం స్వీకరించాల్సి ఉండటంతో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులు సమీకరించే బాధ్యతలను ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ సంస్థకు అప్పగించింది.
రూ. 13,600 కోట్ల రుణాల సమీకరణ – వడ్డీ రేట్ల వద్ద చిక్కుముడి:
మెట్రో ఫేజ్-1(Hyderabad Metro)ను స్వాధీనం చేసుకోవడంలో బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు ప్రధాన సమస్యగా మారాయి. ప్రస్తుతం ఉన్న రుణాలపై 7% నుంచి 8% వరకు వడ్డీ పడుతుండటంతో, ప్రభుత్వంపై భారం పడకుండా తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే సంస్థల కోసం అన్వేషణ సాగుతోంది. గతంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) 4% కన్నా తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు సమ్మతించినా చివరి నిమిషంలో నిలిచిపోయింది. తాజాగా యూనియన్ బ్యాంక్ ముందుకు వచ్చినా 7% కంటే ఎక్కువ వడ్డీ అడుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా హెచ్ఎండీఏ నిధులను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏప్రిల్లోనే ఈక్విటీ ఒప్పందం – సెప్టెంబర్ 30కి గడువు పెంపు:
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1లో ఎల్ అండ్ టి వాటాను కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.1,461.47 కోట్లతో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదిరింది. అప్పటి నుంచి ఈ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వంపైనే పడుతోంది. రుణ సమీకరణ ప్రక్రియలో జాప్యం జరగడంతో, ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30 కల్లా పూర్తి చేస్తామని ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ సెబీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.
