Hyderabad Traffic Relief : హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్ పెట్టే కొత్త ఐడియా.. ఓ రిటైర్డ్ ఉద్యోగి మ్యాప్‌తో మారనున్న రోడ్ల ముఖచిత్రం!
Hyderabad Traffic Relief : హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు 73 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా వన్‌వే లూప్ ప్రతిపాదన సిద్ధమైంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
Hyderabad Traffic Relief
- ట్రాఫిక్ కష్టాలకు వన్‌వే దెబ్బ..
- 73 ఏళ్ల వ్యక్తి ఆలోచనతో కొత్త లూప్‌కు శ్రీకారం
- లక్డీకాపూల్‌లో త్వరలో కొత్త ట్రాఫిక్ ప్రయోగం
Hyderabad Traffic Relief : హైదరాబాద్‌లో ట్రాఫిక్ అంటేనే వాహనదారులకు ఓ పెద్ద పరీక్ష.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపైకి వస్తే చాలు.. ఎక్కడికక్కడ వాహనాల బారులు, కూడళ్ల దగ్గర గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు..
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. అయితే, ఈసారి ఓ కొత్త ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అది కూడా ఓ 73 ఏళ్ల విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఇచ్చిన ఐడియాతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు..
నగరంలో రోజూ కనిపించే ట్రాఫిక్ ఇబ్బందులను గమనించిన పాలకొడేటి చంద్రశేఖర్.. లక్డీకాపూల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తే రద్దీ తగ్గుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా కాగితంపై ఓ మ్యాప్ గీసి, ఏ రోడ్డు నుంచి వాహనాలు వెళ్లాలి? ఎక్కడ మళ్లించాలి? ఏ మార్గాలను లింక్ చేయాలి? అనే వివరాలను బాణం గుర్తులతో స్పష్టంగా చూపించారు. ఆ మ్యాప్‌ను ట్రాఫిక్ పోలీసులకు మెయిల్ చేశారు..
చంద్రశేఖర్ ప్రతిపాదనపై అధికారుల ఫోకస్ :
చంద్రశేఖర్ పంపిన ప్రతిపాదన అధికారుల దృష్టిని ఆకర్షించింది.. పోలీస్ కమిషనర్ సజ్జనర్ సైతం ఆయన్ను పిలిపించి ఆలోచనలు ఏంటో తెలుసుకున్నారు. లక్డీకాపూల్, సచివాలయం రోడ్డు, రవీంద్రభారతి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాలను కలుపుతూ వన్‌వే లూప్ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రతిపాదనలోని ప్రధాన ఉద్దేశం..
ద్వారకా హోటల్, ఎల్ఐసీ భవనం, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్, డీజీపీ ఆఫీసు వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే దీనిపై ట్రాఫిక్ సిమ్యులేషన్ అధ్యయనం పూర్తయింది. రహదారుల అభివృద్ధి, కూడళ్లలో మార్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు..
22నే ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు :
ఈ నెల 22న ప్రతిపాదిత లూప్‌పై ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల పోలీస్ కమిషనర్ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ట్రాఫిక్ అదనపు సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయిలో పర్యటించి జంక్షన్లను పరిశీలించారు..
ట్రయల్ రన్‌కు ముందే స్థానిక వ్యాపారులు, నివాసితులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకోనున్నారు. మొత్తానికి ఓ సాధారణ పౌరుడి ఆలోచన ఇప్పుడు నగర ట్రాఫిక్‌కు కొత్త దారి చూపించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు కొంతైనా తగ్గే అవకాశం ఉంది..
