Adilabad : తల్లికిచ్చిన మాట కోసం… ఏకంగా 150 ఎకరాల భూమి దానం.. 30 మంది రైతుల పేరిట పట్టా
Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన సంఘటన వెలుగు చూసింది. 150 ఎకరాల భూమిని దానం చేశాడో వ్యక్తి
- Dharani Pilli
- Published On : April 2, 2026 / 12:38 PM IST
In adilabad landlord donated 150 acres to thiry members farmers
- ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన ఘటన
- తల్లి మాట ప్రకారం 150 ఎకరాల భూమి దానం
- 30 మంది రైతుల పేరిట పట్టా
Adilabad : ఒకప్పుడంటే.. భూమికి ఇంత ధర లేదు కాబట్టి.. కొనడానికి.. ఉన్న భూమిని కట్టుదిట్టం చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బంజరు భూమిని సైతం వదలడం లేదు. సాగు భూమి అయితే గజం కాదు కదా.. ఫీటు భూమిని కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందుకు కారణం పెరుగుతున్న జనాభా, జనవాసాలే. మరి భూమి బంగారం కన్నా విలువైన సంపదగా మారిన తరుణంలో ఓ వ్యక్తి ఒకటి, రెండు కాదు ఏకంగా 150 ఎకరాల భూమిని దానం చేసి కలియుగ కర్ణుడు అనిపించుకున్నాడు. ఆ వివరాలు..
ఆదిలాబాద్ జిల్లాలో ఈ అపురూప సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తన భూమిని సాగు చేసుకుంటున్న రైతులకే దాన్ని దానం చేయాలని భావించి.. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 150 ఎకరాల భూమిని 30 మంది రైతుల పేరిట పట్టాలు చేయించారు.. ఇచ్చోడ మండలానికి చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి. ఈ భూమి అసలు యజమాని విద్యాసాగర్ రెడ్డి తల్లి ఏనుగు ఆశాబాయి.
ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ పంచాయతీ పరిధిలో ఆశాబాయి పేరున 150 ఎకరాలకు పైగా భూమి ఉంది. గత కొన్నాళ్లుగా 30 మంది రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆ రైతులంతా ఆశాబాయిని కలిసి.. ఆ భూమిని తమ పేర్లపై పట్టా చేసి ఇవ్వాలని కోరుకున్నారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి ఆశాబాయి భూమిని దానమివ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతుల పేరుపై పట్టాలు చేయించాలని తన కుమారుడు విద్యాసాగర్‌రెడ్డికి సూచించారు.
తల్లి సూచన మేరకు విద్యాసాగర్‌రెడ్డి మొత్తం 150 ఎకరాల భూమిని 30 మంది రైతులకు పట్టా చేయించారు. ఇటీవలే అందరికీ పాస్ పుస్తకాలు మంజూరు అయ్యాయి. కోరిన వెంటనే తమ పేర భూదానం చేసిన ఆశాబాయి కుటుంబ సభ్యులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆశాబాయి దాతృత్వాన్ని అందరూ పొగుడుతున్నారు.
