Kalvakuntla Kavitha: పరీక్ష రాసే డీజీపీ అయ్యావా? కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. డీజీపీపై కల్వకుంట్ల కవిత ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Kalvakuntla Kavitha makes sensational comments about Telangana DGP cv Anand.
- డీజీపీపై కవిత తీవ్ర విమర్శలు
- నర్సు కేసు సీబీఐకి ఇవ్వాలి
- రేవంత్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌ను కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీగా సేవలు అందించిన ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే సామాన్య మహిళ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, న్యాయం జరగకపోతే అంతర్జాతీయ వేదికలపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతానని ఘాటుగా హెచ్చరించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు.. ప్రజాసమస్యలు పక్కదారి:
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. సీవీ ఆనంద్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేటు, గంజాయి అక్రమ రవాణా పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని విమర్శించారు. రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై చర్చించకుండా, అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు “నువ్వెక్కడున్నావ్.. నేనెక్కడున్నా” అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
నర్సు హత్య కేసులో లొసుగులు.. బాధితురాలి కుటుంబానికి పరామర్శ:
అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలో హైదరాబాద్‌లో దారుణానికి గురైన నర్సు కుటుంబాన్ని కవిత(Kalvakuntla Kavitha) పరామర్శించారు. ఈ హత్య మరియు లైంగిక దాడి కేసు దర్యాప్తులో పోలీసులు రహస్యంగా వ్యవహరిస్తున్నారని, ఎఫ్ఐఆర్లో ఆస్పత్రి పేరు కూడా పేర్కొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. సదరు ఆస్పత్రిని తక్షణమే సీజ్ చేయాలని, ఈ దారుణ ఘటనపై పారదర్శక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
