×
Ad

Kalvakuntla Kavitha Hunger Strike : కూల్చిన చోటే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి.. న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగుతుంది : కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Hunger Strike : వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని వారికి న్యాయం జరిగేవరకు పోరాడతానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

kalvakuntla kavitha slams govt over khammam velugumatla issue continues hunger strike at hyderabad Jagruti Office

Kalvakuntla Kavitha Hunger Strike : ఖమ్మం పట్టణ శివారులోని వెలుగుమట్లలో భూదాన్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. ఈ వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. భూదాన్ బాధితులను పరామర్శించడానికి గాను సోమవారం ఖమ్మంలో పర్యటించారు. పునరావాస కేంద్రంలో నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు కవితను అరెస్ట్ చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమె జాగృతి కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత మాట్లాడుతూ.. ‘భూదాన్ భూములంటేనే.. పేదలకు ఇచ్చిన భూములు. కానీ రేవంత్ ప్రభుత్వం ఆ 31 ఎకరాల పేదల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని.. పెద్దలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రభుత్వం అనుకున్నట్లు జరగదు. మేం వెలుగుమట్ల బాధితులకు అండగా ఉన్నాం. వారికి మద్దతుగానే నేను సోమవారం మధ్యాహ్నం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇప్పుడు కూడా దీక్ష కొనసాగుతుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు’ అన్నారు.

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా హైదరాబాద్‌లోనే తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు కవిత. బాధితుల ఇళ్లను కూల్చిన ప్రభుత్వమే.. వారికి పునరావాసం కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఎక్కడైతే ఇళ్లను కూల్చారో… తిరిగి అదే చోట బాధితులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేసేంతవరకూ తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

వెలుగుమట్ల బాధితులకు భూదాన్ భూముల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఖమ్మంలో పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితులకు ఎవరూ అండగా నిలబడలేదని.. ఇళ్లు కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా తయారైందంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెలుగుమట్లలో సామాన్యుల ఇళ్లు కూలగొట్టి కర్కశంగా వ్యవహరించారని కవిత మండిపడ్డారు. పైగా బాధితులను అంబేద్కర్ భవన్‌లో ఉంచారని.. బాధితుల పట్ల ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు.

బాధితులకు మద్దతుగా తాను నిరవధిక దీక్షకు దిగితే.. తనను ఏదో ఉగ్రవాదిలా చూస్తున్నారని.. అందుకే తనను అరెస్ట్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ.. తెలంగాణలోని వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి తాను లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఒక్కరి తప్పు ఉంటే అందరి ఇళ్లు కూల్చుతారా అని కవిత ప్రశ్నించారు. ఇళ్లు కూలిన బాధితుల్లో ఇంటర్, డిగ్రీ పిల్లలు కూడా ఉన్నారని.. ఉండటానికి ఇళ్లు లేకపోతే.. వారంతా ఎక్కడ చదువుకుంటారు.. అసలు పరీక్షలకు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఖమ్మం కలెక్టర్‌కు బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు.. చోద్యం చూస్తున్నారా అంటూ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారులకు ఏం హక్కు ఉందని.. పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చారని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరం అయితే కోర్టులో పిల్‌ (PIL) వేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ల పట్ల లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందంటూ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.