Karimnagar Gold Robbery : పోలీసుల కీలక ప్రకటన.. వారిని పట్టించిన వారికి రూ.లక్ష బహుమానం
Karimnagar Gold Robbery : కరీంనగర్ పీఎంజే బంగారు ఆభరణాల దుకాణంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు.
- Dharani Pilli
- Updated on- May 3, 2026 / 09:34 PM IST
karimnagar police announce rs 1 lakh reward pmj jewellery heist case
Karimnagar Gold Robbery : కరీంనగర్, జ్యోతినగర్ లోని పీఎంజే జ్యూవెలరీ షాపులో కస్టమర్లలా వచ్చిన ఐదుగురు దుండగులు.. షాపులోని వారిని బెదిరించి.. వారిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ లోని కమాండ్ కంట్రోల్ తో పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీంతో పాటు కరీంనగర్ పోలీసులు మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈక్రమంలో చోరీకి పాల్పడిన వారి ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో పాటు.. దుండగుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ భారీ దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టించిన వారికి రూ. లక్ష బహుమతి ఇస్తామని కరీంనగర్ పోలీసులు ప్రకటించారు.
ఈక్రమంలో చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫొటోలలో కనిపిస్తున్న వారు.. కరీంనగర్ లోని బంగారం షాపులో దొంగతనం చేశారు.. వీరి గురించి మీకు ఎలాంటి సమాచారం తెలిసినా సరే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. వీరి గురించి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని కరీంనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఏసీపీల పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆదివారం (మే 3) పట్టపగలు కరీంనగర్ లోని నడిబొడ్డున ఉన్న PMJ జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. తుపాకులతో జ్యువెలరీలో చొరబడ్డ ఐదుగురు దోపిడి దొంగలు.. కస్టమర్లు, షాపు సిబ్బందిని బెదిరించి దాదాపు కిలో బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. బండి సంజయ్ ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటివరకు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఉంది.. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలు భారీ దోపిడీ జరగడం చర్చనీయాంశంగా మారింది.
