KTR Warangal : వరంగల్ రైతు సంగ్రామ సదస్సు వేదికగా కేటీఆర్ చాలెంజ్.. అది నిరూపిస్తే.. MLA పదవికి రాజీనామా చేస్తా
KTR Warangal : మే 6, బుధవారం నాడు వరంగల్ వేదికగా నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Updated on- May 6, 2026 / 03:00 PM IST
KTR open challenge to cm revanth reddy on brs rythu sangrama sadassu in warangal
KTR Warangal : అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ.. మే 6, బుధవారం వరంగల్ నగరం వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఎక్కడైనా కనపడితే ‘రైతుబంధు ఎప్పుడు వేస్తారు?’ అని గల్లా పట్టుకుని నిలదీయాలని రైతులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల పేరిట ఉన్న రూ. 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ చివరకు కేవలం రూ. 12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. మరో రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో రాబంధు రాజ్యం పోయి, రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సదస్సులో కేటీఆర్ చేసిన 4 తీర్మానాలు:
-
కాంగ్రెస్ రాబంధు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయా రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-
గతంలో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 34 హామీలను వెంటనే నెరవేర్చాలి.
-
ఆంక్షలు లేకుండా రైతులు పండించిన అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
-
రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులకు వెంటనే మాఫీ చేయాలి. రైతుబంధు సక్రమంగా వేయడంతో పాటు, రైతు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
ఈ తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తమ్మీద కనీసం ఒక్క ఊరిలోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
