KTR RRR Telangana : తెలంగాణలో RRR సీన్.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
KTR RRR Telangana : తెలంగాణలో కాంగ్రెస్‌పై రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ పరిస్థితి ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పునరాగమనం, కేసీఆర్ సీఎం, బీజేపీ పొత్తు, డీలిమిటేషన్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR RRR Telangana
- ఇండియా టుడే సదస్సులో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
- కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
- బీజేపీతో పొత్తు ఉండదు.. బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం
KTR RRR Telangana : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (Recall, Regret and Revolt) పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన ఆయన.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నారని, ఆ పశ్చాత్తాపం క్రమంగా తిరుగుబాటు దిశగా మారుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420కిపైగా హామీలు ఇచ్చిందని, అందులో ఒక్కదాన్ని కూడా పూర్తిగా (KTR RRR Telangana) అమలు చేయలేకపోయిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగిందని అన్నారు. రీకాల్ అంటే కాంగ్రెస్‌కు ఓటేసిన నిర్ణయాన్ని ప్రజలు తిరిగి ఆలోచించడం, రిగ్రీట్ అంటే ఆ నిర్ణయంపై పశ్చాత్తాపం, రివోల్ట్ అంటే ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారిందని ఆయన వివరించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా.. :
తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం తగ్గిందన్నారు.
కేటీఆర్ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గత 26 ఏళ్లలో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోలేదని, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకమని పేర్కొన్నారు. అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటామన్నారు.
Read Also : Crop MSP Hike : అన్నదాతలకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. పంటల కనీస మద్దతు ధర పెంపు? ఏ పంటకు ఎంతంటే?
డీలిమిటేషన్‌పైనా కేటీఆర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగవచ్చని అన్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుందన్నారు.
దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24శాతం నుంచి 19శాతానికి తగ్గిందని చెప్పారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదో చెప్పాలన్నారు. కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.
అలా సీట్లు పెంచితేనే మద్దతు ఇస్తాం :
పార్లమెంట్ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా పెంచాలని, మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తామన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను తాము నమ్మలేమన్నారు. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని భావిస్తున్నామని తెలిపారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
