Telangana Rain Alert : దూసుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ
Telangana Rain Alert : వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rain Alert
Telangana Rain Alert : తెలంగాణలో గత వారం దంచికొట్టిన వానలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. అది వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : Mancherial Accedent: మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీకొని ఇద్దరు కూలీలు మృతి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 72గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రానున్న 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఊపందుకుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోని నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతోపాటు భీకర గాలులు వీస్తాయని.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లోనూ వాతావరణం పూర్తిగా పొడిగా ఉండే పరిస్థితి లేదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
