Meat Shops Closed : GHMC కీలక అలర్ట్.. మార్చి 31న మాంసం దుకాణాలు బంద్ చేయాల్సిందే.. కారణమిదే

Meat Shops Closed : మార్చి 31 నాడు హైదరాబాద్ నగరంలోని మాంసం దుకాణాలు బంద్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

on occasion of mahavir jayanti all meat and beef shops to remain closed in hyderabad on march 31

Meat Shops Closed : ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్ నగరంలో చికెన్ షాపులు బంద్ చేస్తామని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ విషయం అలా ఉంచితే మార్చి 31న మాత్రం హైదరాబాద్ లో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. కారణం ఏంటంటే.. మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి. ఈ క్రమంలో ఆ రోజున నగరంలో ఉన్న వధశాలలు, మాంసం దుకాణాలు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ వారం రోజుల క్రితం అధికారిక ప్రకటన జారీ చేశారు. మార్చి 31 మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చికెన్, మటన్ సెంటర్లతో పాటు ఇతర జంతువుల మాంసం అమ్మే దుకాణాలు, వధశాలలను ఆరోజంతా మూసివేయాలని తెలిపారు.

జైన మత తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని జన్మదినోత్సవం నేపథ్యంలో మహావీర్ జయంతి నాడు.. అహింసను పాటించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా నగరంలోని మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేస్తుంది.