Hyderabad Bullet Train: హైదరాబాద్ హైస్పీడ్ రైల్ ఎటు నుంచి? భూసేకరణ ప్రక్రియపై మొదలైన రాజకీయం.. స్పష్టత ఇచ్చిన రైల్వే శాఖ!
హైదరాబాద్ హైస్పీడ్ (Hyderabad Bullet Train) రైల్ కారిడార్ల అలైన్మెంట్ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో తీవ్ర కలకలం రేపుతోంది.
Railway Department clarified the route for Hyderabad high-speed bullet train project not yet finalized.
Hyderabad Bullet Train: హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన అత్యంత ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ (బుల్లెట్) రైల్ కారిడార్ల అలైన్మెంట్ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె మార్గాల్లో ప్రణాళిక చేసిన ఈ రైల్ రూట్ ఎక్కడి నుంచి వెళ్తుందనే దానిపై గత కొంతకాలంగా రకరకాల ప్రచారాలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడ మీదుగా ఈ అలైన్మెంట్ వెళ్తోందని, భూసేకరణకు సైతం చర్యలు వేగవంతమయ్యాయని వార్తలు రావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
రంగంలోకి బిఆర్ఎస్.. స్థానికులకు పరామర్శ, భూసేకరణపై వినతి:
బహదూర్ గూడ ప్రాంతంలో భూమి కోల్పోతామనే భయంతో ఉన్న రైతులు, బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) నేతలు స్వయంగా రంగానికి దిగారు. పచ్చని పంట పొలాలను, నివాసాలను భూసేకరణ పేరిట గుంజుకోవద్దని, భూసమీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించింది. ఈ క్రమంలో రూట్ ఇటు నుంచి వెళ్తుందంటూ ఒకరు, అటు నుంచి మళ్లుతుందంటూ మరొకరు ప్రచారం చేయడంతో స్థానికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
బీజేపీ బిగ్ క్లారిటీ.. అలైన్మెంట్ ఏదీ ఖరారు కాలేదు:
ఈ వివాదంపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే(Hyderabad Bullet Train) మంత్రి అశ్వినీ వైష్ణవ్ల మధ్య జరిగిన కీలక సమావేశంతో సరికొత్త మెలిక తిరిగింది. హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఎలాంటి అలైన్మెంట్ కూడా ఇంకా తుది రూపం దాల్చలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రస్తుతం కేవలం సాంకేతిక అధ్యయనాలు (Survey & Alignment Studies) మాత్రమే జరుగుతున్నాయని, ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ భూసేకరణ కోసం అధికారికంగా ప్రతిపాదనలు పంపలేదని తేల్చిచెప్పింది.
అసలు రూట్ ఎక్కడ? అధ్యయనం పూర్తయ్యాకే స్పష్టత:
రైల్వే శాఖ ప్రకటన ప్రకారం.. మూడు కారిడార్లకు సంబంధించిన రూట్ మ్యాప్ విశ్లేషణలు పూర్తయిన తర్వాతే అధికారికంగా అలైన్మెంట్ను ప్రకటిస్తారు. పూర్తి వివరాలను రైతులు, రాష్ట్ర ప్రభుత్వాల ముందే ఉంచుతామని, కాబట్టి ముందస్తుగా భూసేకరణ పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. దీంతో అసలు హైస్పీడ్ రైల్ రూట్ ఏది అనే దానిపై కేంద్ర ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
