Indiramma Towers: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 4 నగరాల్లో ఇందిరమ్మ టవర్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హైదరాబాద్ తరహాలోనే పలు నగరాల్లో జీ+5 పద్ధతిలో ఇందిరమ్మ టవర్లు(Indiramma Towers) నిర్మించనున్నట్లు తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
Revanth reddy govt to build indiramma towers in four more cities
Indiramma Towers: తెలంగాణలో సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న పేదలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers) నిర్మించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో తొలి విడతగా జీ+5 (G+5) పద్ధతిలో అత్యాధునిక ఇందిరమ్మ భవన సముదాయాలను నిర్మించి అర్హులైన పేదలకు ఫ్లాట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు.
నాలుగు నగరాల్లో స్థలాల గుర్తింపు.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల:
ఈ నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం కోసం అధికారులు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లకు గృహప్రవేశాలు విజయవంతంగా పూర్తయినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి వేడుకలను కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లలోనే ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించారు.
ఆర్థిక సాయం, పారదర్శక ప్రక్రియ.. ఫ్లాట్ల కేటాయింపులో లాటరీ:
ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుండగా, మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పటికే లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించగా, రూ.లక్ష డిపాజిట్ చేయని వారి స్థానంలో కొత్తవారి కోసం మళ్లీ లాటరీ నిర్వహించారు. జిల్లాల్లోనూ పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, స్థానిక నియోజకవర్గాల పరిధిలోనే ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్లు అందించేందుకు సర్కార్ పక్కా ఏర్పాట్లు చేస్తోంది.
