TCS Hypervault: హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఏఐ సెంటర్.. రూ.70వేల కోట్లతో ‘టీసీఎస్ హైపర్‌వాల్ట్’.. సీఎం సమక్షంలో ఒప్పందం!
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా(TCS Hypervault) తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ మైలురాయిని సాధించింది.
Tcs hypervault to set up india's largest ai data center in hyderabad with 70000 crore
- రూ.70వేల కోట్ల భారీ పెట్టుబడి
- 7వేల కొత్త ఉద్యోగ అవకాశాలు
- హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఏఐ సెంటర్
TCS Hypervault: తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ మైలురాయిని సాధించింది. హైదరాబాద్ నగరం వేదికగా దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో టీసీఎస్ హైపర్‌వాల్ట్(TCS Hypervault), తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పంద (MoU) పత్రాలను అధికారికంగా మార్చుకున్నారు. ఐటీ, సాంకేతిక రంగాలలో హైదరాబాద్ స్థానాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేయనుంది.
రూ.70వేల కోట్ల భారీ పెట్టుబడి.. 250 ఎకరాల్లో గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు:
ఈ భారీ ప్రాజెక్టు కోసం టీసీఎస్ హైపర్‌వాల్ట్ సంస్థ ఏకంగా రూ.70,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. సుమారు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగా వాట్ భారీ సామర్థ్యంతో ఈ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఐటీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు లభించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
7 వేల మందికి ఉద్యోగావకాశాలు.. మంత్రివర్గం హర్షం:
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7,000 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ డేటా సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
