TS Anganwadi Recruitment 2026 : నిరుద్యోగులకి శుభవార్త.. త్వరలోనే 15,982 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. కేవలం మహిళలకు మాత్రమే
TS Anganwadi Recruitment 2026 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ముఖ్యంగా మహిళలకు శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- May 22, 2026 / 05:23 PM IST
telangana anganwadi job notification to be released For 15982 posts soon
TS Anganwadi Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 15,982 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకు ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు ఏ శాఖలో భర్తీ చేయనున్నారంటే.. అంగన్‌వాడీలో. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. రేవంత్ సర్కార్.. ఈ ఏడాదిలోనే 15,982 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. హెల్పర్, టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పైగా కేవలం మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. బాలల సంక్షేమం, పోషణ, ప్రాథమిక విద్యాభ్యాసానికి అంగన్‌వాడీ కేంద్రాలు చాలా కీలకమైనవి. అయితే వీటిల్లో సిబ్బంది కొరత కారణంగా సేవలు సకాలంలో అందడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని భావిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన పదోన్నతులు, పదవీ విరమణల వల్ల వచ్చిన ఖాళీలతో పాటుగా.. కొత్తగా సృష్టించిన 708 పోస్టులను కలిపి మొత్తం 15,982 పోస్టులు ఖాళీ ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ మొత్తం పోస్టుల్లో..
- హెల్పర్ పోస్టులు 12,882 ఉండగా,
- టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో 71,562 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా.. పదవీ విరమణ, ప్రమోషన్లు, ఇతర శాఖలకు బదిలీలు వంటి కారణాలతో సుమారు 22.33 శాతం పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తంగా కలిపి 15 వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉండగా.. త్వరలోనే వాటిని భర్తీ చేయనున్నారు.
*కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు
తెలంగాణ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలోనే వీటి భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, నియామక విధానం, వేతనాలు వంటి వివరాలను స్పష్టం చేయనున్నారు. ముందుగా కొత్త నియామక విధానానికి ఆమోదం పొందిన తర్వాత జిల్లా స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ సాఫీగా జరగాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
*ఐటీ ఉద్యోగులకు భారీషాక్.. భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా? సాఫ్ట్‌వేర్ ఉచితం కాబోతోంది..
ఈ నిర్ణయం తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం కల్పించనుంది.. అంగన్‌వాడీలు సమాజంలో ముఖ్యమైన భాగం కావడంతో, నాణ్యమైన సిబ్బంది ద్వారా సేవలు మెరుగుపడతాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం త్వరగా మార్గదర్శకాలను జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
