Revanth Reddy Roja : తెలంగాణ CM రేవంత్ రెడ్డిని కలిసిన వైసీపీ నాయకురాలు రోజా

Revanth Reddy Roja : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశ చోటు చేసుకుంది.

telangana cm revanth reddy and ycp leader roja meet at delhi

Revanth Reddy Roja : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వైసీపీ నాయకురాలు రోజా కలిశారు. రోజా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంట్‌కు వచ్చారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, రోజా ఇరువురూ ఎదురుపడ్డారు. ఇరువురు నేతలు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. రోజాకు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే రేవంత్, రోజా పలకరించుకున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, రోజా ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటుకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉండటంతో ఇరువురూ పలకరించుకున్నారు. ఇరువురి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, పాత పరిచయంతో వారు ఆప్యాయంగా మాట్లాడుకోవడం విశేషం.