Hyderabad KBR Park : కేబీఆర్ పార్క్ ప్రాజెక్టులో బిగ్ చేంజ్.. రెండు స్టీల్ ఫ్లైఓవర్లకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్.. జీవో 927 జారీ!

Hyderabad KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు ఉద్దేశించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది.

Telangana government issued orders for construction steel flyovers around KBR Park

Hyderabad KBR Park: హైదరాబాద్‌లోని ప్రముఖ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు ఉద్దేశించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం జీవో 927ను జారీ చేసింది. గతంలో ప్రతిపాదించిన పలు అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్ల స్థానంలో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా రెండు అధునాతన స్టీల్ ఫ్లైఓవర్లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు ప్యాకేజీ-1 కింద మొదటి స్టీల్ ఫ్లైఓవర్, అలాగే ముగ్ధ జంక్షన్ నుంచి ముఫకమ్‌జా కాలేజ్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1కి అనుసంధాన ర్యాంప్‌తో ప్యాకేజీ-2 కింద రెండో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది.

Read Also – AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ.. స్థానిక పోరుపై మంత్రులకు దిశానిర్దేశం!

కాంట్రాక్టులలో మార్పులు.. పాత జీవో రద్దుతో కేబీఆర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సవరించిన ప్లాన్:

ఈ బృహత్తర స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ఈపీసీ కాంట్రాక్టర్‌గా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం కోసం గతంలో జారీ చేసిన జీవో 835ను సర్కారు పూర్తిగా రద్దు చేసింది. దీనికి అనుగుణంగా కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్‌కు కేటాయించిన ఎల్‌వోఏను రద్దు చేస్తూ, ఆ సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. సవరించిన ఈ ప్రతిపాదనలను ఈపీసీ కమిటీ-3 ముందు ఉంచాలని ఆదేశించిన ప్రభుత్వం, ప్రస్తుత ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల సేవలను యథావిధిగా కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.