Metro RTC Common Pass: మెట్రో, ఆర్టీసీ ‘కామన్ పాస్’పై సర్కార్ యూటర్న్.. ఆశించిన స్థాయిలో రాని స్పందన.. ధరల సవరణకు సిద్ధం!
ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన 'కామన్ పాస్(Metro RTC Common Pass)' విధానంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
Telangana government reconsidering the unified pass system for metro and buses.
Metro RTC Common Pass: హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను అనుసంధానిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన ‘కామన్ పాస్’ విధానంపై ప్రభుత్వం తీవ్ర పునరాలోచనలో పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పాస్‌కు ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడమే కాకుండా, దీనిపై విపరీతమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్టోబర్ మొదటి వారంలో అందుబాటులోకి వచ్చిన ఈ విధానంలో రోజువారీ పాస్ ధరను రూ. 400గా, నెలవారీ పాస్ ధరను భారీగా రూ. 8,500గా నిర్ణయించడమే ఈ తీవ్ర నిరసనకు ప్రధాన కారణంగా మారింది.
నెలకు రూ.8,500 దండగేనా? లెక్కలు కడుతున్న ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు:
నెలవారీ పాస్(Metro RTC Common Pass) ధరలో మెట్రో వాటా రూ. 7,000 కాగా, ఆర్టీసీ వాటా రూ. 1,500గా నియమించారు. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో రోజువారీ ప్రయాణానికి గరిష్టంగా రూ. 140 చొప్పున నెలకు రూ. 4,200 మాత్రమే అవుతుందని, అలాగే ఆర్టీసీ ఆర్డినరీ పాస్ రూ. 1,850కే లభిస్తుండగా, రూ. 5,000తో పూర్తయ్యే ప్రయాణానికి రూ. 8,500 వసూలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ నిర్ణయం ప్రయాణికుల జేబులకు చిల్లు పొడిచేలా ఉందే తప్ప, ఏమాత్రం ఉపశమనం కలిగించేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు నో చాన్స్.. సవరణలకు సిద్ధమవుతున్న సర్కారు:
మరోవైపు ఈ కామన్ పాస్ ప్రకటనలో విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేదా తగ్గింపులు ఇవ్వకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఈ వర్గాలకు ఆర్టీసీలో రాయితీలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కామన్ పాస్‌ను రూ. 5,000 నుంచి రూ. 6,000ల మధ్యకు తగ్గించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్ర ప్రతికూల స్పందనను గుర్తించిన ప్రభుత్వం, ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నామని, త్వరలోనే ధరల్లో అవసరమైన మార్పులు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.
