TG Breakfast Inter Students : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే వార్త.. ఇకపై ప్రతి రోజు ఇడ్లీ, దోశ, పూరి, బోండా.. ఎప్పటి నుంచంటే..
TG Breakfast Inter Students : తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- May 28, 2026 / 07:49 AM IST
telangana government will start breakfast and mid day meal to inter students from this academic year
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- ఇంటర్ విద్యార్థులకు ఉదయం టిఫిన్
- జూన్ 12 నుంచి పథకం ప్రారంభం
TG Breakfast Inter Students : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం కూడా అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం, ఉదయం టిఫిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వయసుకు తగినట్లుగా ఎదిగేందుకు వారికి సరైన పౌష్టికాహారం అందించాలని నిర్ణయించుకున్న రేవంత్ సర్కార్ ఇంటర్ విద్యార్థుల కోసం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చారు. ఇది ఈ సంవత్సరం నుంచే అమలు అవుతుంది. ఇక ఇంటర్ విద్యార్థులకు అందించే అల్పాహారంలో దోశ, పూరి, మిల్లెట్ ఇడ్లీ, బోండా, ఉప్మా, మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా వంటివి వడ్డించనున్నారు. ఈ పథకం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అవుతుంది.
జూన్ 12 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు ఏటా రూ.180 కోట్ల ఖర్చు చేయనున్నారు.
ఇప్పటివరకు దేశంలో పాఠశాల విద్యార్థుల వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఏ రాష్ట్రంలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేశంలోనే తొలిసారి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించబోయే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
తొలి రోజు 64 కళాశాలల్లో..
ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థుల కోసం అమలు చేయబోతున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్, 12న ప్రారంభిస్తారు. మొదటగా 64 కాలేజీల్లో అనగా సుమారు 41,250 మంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేస్తారు. ఆపై పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభమైన తర్వాత ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు కలిపి రోజుకు 1.92 లక్షల మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.100 కోట్లను వెచ్చించనున్నారు. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు ఒక్కో రోజు ఒక్కో వెరైటీ టిఫిన్ పెడతారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూ..
- మొదటి రోజు: దోశ + చట్నీ
- 2వ రోజు: మిల్లెట్ ఇడ్లీ + సాంబార్
- 3వ రోజు: పూరీ + మిక్స్‌డ్ వెజిటెబుల్ కుర్మా
- 4వ రోజు: బోండా + చట్నీ
- 5వ రోజు: ఇడ్లీ + చట్నీ
- 6వ రోజు: ఉప్మా + చట్నీ / సాంబార్
