Aadhaar-Pan Verification : ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్, పాన్ అప్డేట్ చేశారా? వెరిఫికేషన్‌కు డెడ్‌లైన్ ఇదే..!
Aadhaar-Pan Verification : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్డేట్. ఆధార్–పాన్ వెరిఫికేషన్, IFMS పెన్షన్ మాడ్యూల్ అప్డేట్, డిసెంబర్ 31 గడువు, పెన్షన్ రికార్డుల పరిశీలన గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Aadhaar-Pan Verification
- పెన్షనర్లూ అలర్ట్.. మీ ఆధార్, పాన్ వివరాలు అప్డేట్ చేశారా?
- డిసెంబర్ 31లోగా ఈ పని పూర్తి చేయాలి.. ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సూచన
- పెన్షన్ బకాయిలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ సర్కార్ కీలక చర్యలు?
Aadhaar-Pan Verification : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్డేట్. ఆధార్, పాన్ కార్డు వివరాల వెరిఫికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2026 డిసెంబర్ 31లోగా ముగించాలని సంబంధిత శాఖలకు గడువు విధించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తమ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
హెచ్ఓడీలకు కీలక ఆదేశాలు :
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్ల ఆధార్, పాన్ వివరాలను సేకరించి, ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IFMS) పెన్షన్ మాడ్యూల్లో రిజిస్టర్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఇందుకోసం ట్రెజరీ, అకౌంట్స్ శాఖ అధికారులు అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి, రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
పెన్షన్ చెల్లింపుల్లో జాప్యానికి చెక్? :
పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్ బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందంటూ పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలు సక్రమంగా నమోదైతే చెల్లింపుల ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అక్రమ పెన్షన్ల గుర్తింపునకు ఉపయోగం :
ఆధార్, పాన్ వివరాలను సర్వీస్ రికార్డులు, ఇతర డాక్యుమెంట్లతో సరిపోల్చి చూడాలని అధికారులకు సూచించింది. వివరాల్లో తప్పులు ఉంటే సరిచేయడంతో పాటు, పెన్షనర్ల గుర్తింపు ప్రక్రియను పటిష్టం చేయనున్నారు. అనర్హంగా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించడం, మరణించిన పెన్షనర్ల రికార్డులను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
నివేదికల ప్రకారం.. 2026 చివరి నాటికి 9,719 మంది ఉద్యోగులు, 2027లో మరో 9,443 మంది రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆధార్, పాన్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.
