TG Jowar Distribution : తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఇకపై రేషన్ కార్డు మీద ఇవి కూడా పంపిణీ.. పూర్తి ఉచితంగా..!
TG Jowar Distribution : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ దుకాణాల్లో వీటిని కూడా పంపిణీ చేయనున్నారు.
- Dharani Pilli
- Updated on- May 6, 2026 / 09:28 AM IST
telangana govt will decide to distribute jowar sorghum and corn in ration shops
TG Jowar Distribution : తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల మీద జొన్నలను కూడా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ ద్వారా అన్నదాతల వద్ద నుంచి సేకరించిన జొన్నలు, మక్కలను కేవలం మార్కెట్‌లో అమ్మే ధాన్యం, సరుకుగా చూడవద్దని కోరారు. ఈ ధాన్యాలను పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
అన్నదాతల వద్ద నుంచి సేకరించిన మక్కలు, జొన్నలను బహిరంగ వేలం వేస్తే.. దీని ద్వారా మధ్యవర్తులు లాభపడే అవకాశం ఎక్కువగా ఉందన్న భట్టి విక్రమార్క.. అలా కాకుండా ఈ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ దుకాణాల) ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తే వారి ఆకలి తీరడమే కాక.. ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు గాను ఈ జొన్నలు, మక్కలను వినియోగించాలని సూచించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మక్కలను నేరుగా పౌల్ట్రీ రైతులకు కేటాయించాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘రిసోర్స్ మొబిలైజేషన్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. పలు కీలక అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాన్యుడి సంక్షేమమే కేంద్రబిందువుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని సూచించారు.
