Konda Surekha : రాజకీయంగా కొండా ఫ్యామిలీ దారెటు.. మళ్లీ పాత గూటికేనా..? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ
Konda Surekha : తెలంగాణ పాలిటిక్స్‌లో కొండా ఫ్యామిలీ రూటే సపరేటు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమదైన ముద్ర వేసిన కొండా ఫ్యామిలీ.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారి తీస్తుంది.
- Harish Thanniru
- Published on- November 4, 2026 / 01:09 PM IST
Konda Surekha
Konda Surekha : తెలంగాణ పాలిటిక్స్‌లో కొండా ఫ్యామిలీ రూటే సపరేటు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమదైన ముద్ర వేసిన కొండా ఫ్యామిలీ.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చకు దారి తీస్తుంది. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం.. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గురికావడం చకచకా జరిగిపోయాయి. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా సురేఖ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం అని చెప్పుకొచ్చిన ఆమె.. ఆ తర్వాత ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీ వెళ్లి కలిసి వచ్చారు. ఆమెకు కీలక పదవి దక్కబోతుందన్న ప్రచారం కూడా నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. కొండా సురేఖ పార్టీ, ప్రభుత్వం కార్యక్రమాలకు అటెండ్ కాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక.. వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ తరపున చేపట్టే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు.
ఎస్ఐఆర్ విషయంలో పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టినా ఎక్కడా కూడా పాల్గొనలేదామె. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఆఖరికి ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కూడా వెళ్లలేదు కొండా సురేఖ. ఇలా పార్టీ చేపట్టే ఏ ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనడం లేదు. చివరాఖరికి ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తే కూడా మీటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలా కొండా సురేఖ సైలెంట్‌గా ఉండటంపై పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఒంటరి అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గతంలోనే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా కొండా సురేఖపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర పెద్ద పంచాయితీ జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లురవి ఈ ఎపిసోడ్లో ఇరుపక్షాలతో చర్చించి మ్యాటర్ సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న నేతలంతా గాంధీభవన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ మంత్రి పదవిపోవడంలో జిల్లా నేతలంతా కూడా వ్యతిరేకంగా పనిచేశారట. ఓరుగల్లు కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్రస్థాయి ముఖ్యనేతలెవరితోనూ సఖ్యత లేకపోవడంతో.. ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది.
ఒకవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ.. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేయడం చర్చకు దారి తీస్తుంది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానంటూనే… అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి అలా మాట్లాడాల్సిన వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పట్ల ఆమె సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం పొలిటికల్ డిస్కషన్ పాయింట్ అయింది. సో కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వస్తే.. ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అని చర్చ జరుగుతుంది. ఇలా కొండా సురేఖ మౌనంపై తెలంగాణ పాలిటికల్ సర్కిల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొండా సురేఖ.. త్వరలో హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారా అనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే జిల్లా జిల్లా నేతల నుంచి రాష్ట్రస్థాయి ముఖ్యమైన నేతల వరకు అందరితో గ్యాప్ రావడంతో.. కాంగ్రెస్‌ను వీడుతారా.? హస్తంకు హ్యాండ్ ఇస్తే ఆమె నెక్స్ట్ రాజకీయ ప్రయాణం ఏ పార్టీలో.? బీఆర్ఎస్ కొండా సురేఖను చేర్చుకునే అవకాశం ఉందా.? కారెక్కే ఆలోచనలో భాగంగానే.. ముందుగా కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారా.? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి.
