Telangana rajanna sircilla Man Injured In iran Attack Near Abu Dhabi Airport
Telangana Man Injured: ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండటంతో.. ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. దీనిలో భాగంగా పలు గల్ఫ్ దేశాల మీద దాడులకు పాల్పడుతోంది. దాడుల నేపథ్యంలో చాలా దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దాడుల వల్ల ప్రపంచంలోని పలు దేశాలు, మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంభయంగా బతుకుతున్నారు. స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే అబుదాబి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇరాన్ చేసిన దాడిలో పలువురు గాయపడగా వీరిలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. బాధితుడి తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం..
అబుదాబి విమానాశ్రయం వద్ద జరిగిన దాడిలో గాయపడ్డ వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లెకి చెందిన ఎన్. రాజేశ్వరరావుగా గుర్తించారు. కుటుంబ పోషణ నిమిత్తం కొన్నాళ్ల క్రితం ఇతడు అబుదాబి వెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తున్నారు. తాజాగా అబుదాబి విమానాశ్రయం సమీపంలో ఇరాన్ జరిపిన దాడిలో రాజేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలిపారు.
రాజేశ్వరరావు తండ్రి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. “నా కొడుకు గత కొంత కాలంగా అబుదాబి విమానాశ్రయంలో పని చేస్తున్నాడు. అయితే తాజాగా ఎయిర్ పోర్ట్ వద్ద దాడి జరిగిందని, తనకు గాయాలయ్యాయని నా కుమారుడు తెలిపాడు. దాడి జరిగిన తర్వాత నా కుమారుడు వీడియో కాల్ చేసి మాతో మాట్లాడాడు. కానీ తన గాయాలను చూపించలేదు. నా కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాల్సిందిగా రాజేశ్వర రావు కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరోసారి తెరపైకి బాబా వంగా జోస్యం.. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా.. న్యూక్లియర్ వార్ తప్పదా..?
రాజేశ్వరరావు సోదరుడు మాట్లాడుతూ.. “అబుదాబి విమానాశ్రయం వద్ద ఇరాన్ జరిపిన దాడిలో మా అన్నయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మా అన్న గత నాలుగేళ్లుగా ఈ విమానాశ్రయంలో క్లీనింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో ఎయిర్ పోర్ట్ అద్దాలు పగిలాయి. ఆ గాజు పెంకులు మా అన్నయ్య చాతి, కుడి చేతికి గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత మా అన్నయ్య మాకు వీడియో కాల్ చేశారు. కానీ గాయాలను మాకు చూపించలేదు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మాకు తెలిసింది. మా అన్నను క్షేమంగా ఇండియా తీసుకురావాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు సాయం చేయండి” అంటూ వేడుకున్నారు. ఇరాన్ జరిపిన దాడిలో తెలంగాణకు చెందిన వ్యక్తి గాయపడ్డాడనే వార్త.. సిరిసిల్ల జిల్లాలోనే కాక తెలంగాణలోని పలు గ్రామాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి గురించి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి చాలా మంది భారతీయులు ఇండియాకు చేరుకుంటున్నారు. సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుల బృందం… గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి కారణంగా తమకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
ఇజ్రాయెల్, అమెరికా దేశాలు శనివారం నుంచి ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో ఈ రెండు దేశాలు వైమానిక దాడులు జరపగా… ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అటు ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే… సౌదీ అరేబియా, యూఏఈలతో సహా పలు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు దిగింది.