Telangana Rain Alert : మండే ఎండల్లో చల్లని కబురు.. 5 రోజుల పాటు మోస్తరు వానలు.. అన్నదాతలు అలర్ట్ గా ఉండండి
Telangana Rain Alert : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
- Dharani Pilli
- Published On : April 4, 2026 / 08:07 PM IST
telangana weather update five days from april 4 to 8 moderate rains in few districts
Telangana Rain Alert : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. మండే ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి 5 రోజుల పాటు (ఏప్రిల్ 4-8) తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని.. ఇది ప్రజలకు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు.
వర్షం కురిస్తే సామాన్యులకు ఊరటేమో కానీ.. అన్నదాతలు మాత్రం అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు.. కోత దశలో ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వడగళ్ల వాన పడే అవకాశం ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
