MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక ప్రకటన.. ఆ తర్వతే ఎలక్షన్ అన్న పొంగులేటి
MPTC ZPTC Elections : తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Updated on- April 19, 2026 / 04:41 PM IST
TG Minister ponguleti srinivas reddy said mptc zptc elections after summer
MPTC ZPTC Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడనే దానిపై స్పందించారు.
తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి కాలం తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు.
త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పౌర విమానయాన శాఖతో కలిసి పనిచేస్తూ.. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా ప్రారంభం అయ్యేలా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినందున వీలైనంత తొందరలో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అయ్యేలా చూడాలని అన్నారు. అలానే రక్షణ శాఖ సొంతంగా చేపట్టబోయే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
