TGSRTC Offer : బస్టాండ్లలో షాపులు పెట్టేవారికి టీజీఎస్ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్..
TGSRTC Offer : వ్యాపారవేత్తలకు టీజీఎస్ఆర్టీసీ అద్భుతమైన ఛాన్స్ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 694 ఖాళీ కమర్షియల్ షాపులకు త్వరలో టెండర్లు ప్రకటించనుంది. బస్టాండ్లు, డిపోల పరిధిలో త్వరలో టెండర్లు పిలువనుంది.
TGSRTC Offer
TGSRTC Offer : బస్టాండ్లలో బిజినెస్ పెడతామని అనుకుంటున్నారా? అయితే మీకు టీజీఎస్ ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్ అందిస్తోంది. ముఖ్యంగా యువతకు ఈ అరుదైన వ్యాపార అవకాశాన్ని అందిస్తోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి నిజంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న 694 షాపులను అద్దెకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఈ కమర్షియల్ షాపుల్లో హోటళ్లు, ఫుడ్ కోర్టులు, షోరూమ్‌లు, రిటైల్ స్టోర్లు పెట్టుకోవచ్చు. ప్రధాన నగరాలు, బస్టాండ్లు, పట్టణాలు, డిపోలకు అనుబంధంగా ఈ వాణిజ్య స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మెడికల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి అనేక వ్యాపారాలకు ఈ షాపులు అద్భుతంగా ఉంటాయి.
Read Also : Suvarnagiri : జొన్నగిరితో సీమకు బంగారు భవిష్యత్.. సువర్ణగిరి వైభవాన్ని తిరిగి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
షాపుల కేటాయింపు ప్రాసెస్ కూడా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. తద్వారా దళారుల జోక్యానికి తావు ఉండదు. స్పష్టమైన నిబంధనలతో టెండర్ ప్రక్రియ సాగనుంది. ఖాళీగా ఉన్న షాపుల వివరాలు, లీజు గడువు, అద్దె వివరాలు, ప్రస్తుత స్థితి వంటి సమాచారం అంతా ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది.
సంస్థకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వ్యాపార వృద్ధికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించింది. సంస్థ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎండీ నాగిరెడ్డి వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు.
