×
Ad

Kalvakuntla Kavitha Arrest : అర్ధరాత్రి హైడ్రామా మధ్య కల్వకుంట్ల కవిత అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు

Kalvakuntla Kavitha Arrest : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లను కవితను సోమవారం అర్థరాత్రి ఖమ్మంలో అరెస్ట్ చేశారు.

velugumatla bhoodan lands issue kalvakuntla kavitha arrested during hunger strike in khammam case filed on her supporters

Kalvakuntla Kavitha Arrest : ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా రంగంలోకి దిగిన జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత.. వారికి భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాత్రి పునరావాస కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరగడంతో.. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవిత చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కవితతో పాటు ఆమె మద్దతుదారులు మరో 33 మందిపై కేసు నమోదు చేశారు.

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల వద్ద ఉన్న భూదాన భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిని పోలీసులు ఫిబ్రవరి 24న అక్కడ నుంచి తరలించారు. వారు వేసుకున్న గుడిసెలను తొలగించారు. ఈ ఘటన రాజకీయ వివాదాన్ని రాజు చేసింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఇక్కడకు వచ్చి బాధితులను పరామర్శించగా.. తాజాగా సోమవారం నాడు జాగృతి అధ్యక్షురాలు కవిత వెలుగుమట్లకు వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అంబేద్కర్ విగ్రహం వద్ద నాలుగున్నర గంటల పాటు కవిత ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత సోమవారం రాత్రి కవిత పునరావాస కేంద్రంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బాధితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయింది. బాధితులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదన్నారు కవిత. దీంతో అర్థరాత్రి హైడ్రామా నడుమ కవితతో పాటు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మహిళా పోలీసులపై దాడులు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ తెలిపారు.

ఇదిలా ఉంటే, కవితను హైదరాబాద్‌కు తరలించనున్నారు. అయితే వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని.. హైదరాబాద్ వచ్చాక తన జాగృతి కార్యాలయంలో నిరాహార దీక్షను కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో జాగృతి కార్యాలయంలో కవిత దీక్ష కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.