HYD Pet Dog Dispute: పెంపుడు కుక్క పెట్టిన చిచ్చు.. పోలీసు స్టేషన్ మెట్లెక్కిన ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు
Pet Dog Dispute Hyderabad: పెంపుడు కుక్క చేసిన పనికి ఇద్దరు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మరి ఇంతకు ఏం జరిగిందంటే..
- Dharani Pilli
- Updated on- April 15, 2026 / 05:11 PM IST
Hyderbad irs and ifs officers over pet dog Dispute
- హైదరాబాద్ లో వింత ఘటన
- ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల మధ్య
- పెంపుడు కుక్క పెట్టిన చిచ్చు
HYD Pet Dog Dispute: వారు ఇద్దరు గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉన్నారు. సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్న వారు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. నలుగురు నవ్వుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య పెంపుడు కుక్క రాజేసిన చిచ్చు కాస్త పెరిగి పెద్దదయ్యి.. ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లెక్కి.. ఒకరిపై ఒకరు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టుకున్నారు. ఈ సంఘటన బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా ఐఆర్‌ఎస్ అధికారి నితికా సింగ్.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఇక్కడే మరో క్వార్టర్ లో ఐఎఫ్ఎస్ అధికారి సుతన్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న నితికా సింగ్ పెంపుడు శునకం సుతన్ ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకుంది. ఈ చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుతన్.. నితికా సింగ్ ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు. ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది.
దీంతో నితికా సింగ్.. సుతన్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సిబ్బందిపై సుతన్ కేకలు వేశారని.. తమ ఇంటి తలుపులు బలంగా కొట్టడమే కాక.. తమ ఇంటి ఆవరణలో ఉన్న ఓ పూల కుండీని విసిరి కొట్టి ఆస్తికి నష్టం కలిగించారని నితికా సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా సుతన్.. తన గురించి అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, అశ్లీల సంకేతాలు చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. సుతన్ కారణంగా తనకు ప్రాణహాని ఉందని.. అతడి నుంచి తనకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. నితికా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుతన్‌పై బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 75, 79, 324(4), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.
