Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. మంత్రుల జీతాల్లో 50 శాతం కోత..!
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల జీతాల్లో 50 శాతం కోత విధేంచేదుకు రెడీ అయ్యింది.
- Dharani Pilli
- Updated on- April 24, 2026 / 07:39 AM IST
telangana government will decided to cut 50 percent of salaries of ministers and mlas to pay dues of retired employees
- తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
- విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు
- ప్రజాప్రతినిధుల వేతనాల్లో 50 శాతం కోత
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50 శాతం కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తంతో రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెండింగ్ బకాయిలను తీర్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50 శాతం కోత విధించి.. ఆ మొత్తాన్ని.. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం మళ్లించాలని కేబినెట్ తీర్మానించింది. ఉద్యోగులకు అందాల్సిన బకాయిలపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కేవలం 100 రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన రూ. 6,200 కోట్ల బకాయిలను చెల్లించనుంది.
ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు మినిస్టర్లతో పాటు.. ఇతర ప్రజాప్రతినిధుల జీతాల్లో కూడా 50 శాతం కోత విధించి ఈ మొత్తాన్ని కూడా దీనికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బాటలో తెలంగాణ
తెలంగాణ మాదిరే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిలో భాగంగా హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తన జీతంలో 50 శాతం, మంత్రుల జీతంలో 30 శాతం, ఎమ్మెల్యేల జీతంలో 20 శాతం మేర కోత విధించి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా ఇదే పద్ధతి అనుసరించేందుకు రెడీ అవుతోంది.
